anantapuram: మరో వైకాపా వికెట్ అవుట్... ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా గుర్నాథరెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకే బాబు మొగ్గు!
- జగన్ కు షాకివ్వనున్న అనంతపురం నేత
- త్వరలోనే టీడీపీలోకి గుర్నాథరెడ్డి
- ప్రభాకర్ చౌదరితో స్వయంగా మాట్లాడిన చంద్రబాబు!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు షాకిస్తూ మరో నేత తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖ నేతల్లో ఒకరైన గుర్నాథరెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన రాకను అనంతపురం ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించినట్టు సమాచారం.
పార్టీ ప్రయోజనాల కోసమే గుర్నాథరెడ్డిని ఆహ్వానిస్తున్నామని, ఆయన వచ్చినా ప్రభాకర్ నాయకత్వంలోనే పనిచేయాల్సి వుంటుందని ముందుగానే చెప్పించానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నిన్నటి వరకూ అనంతలో గుర్నాథరెడ్డి, ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి వైరాలు కొనసాగగా, ఇప్పుడు ఇద్దరు నేతలూ ఒకే పార్టీలో ఎలా ఇముడుతారన్న విషయమై సందేహాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ విధానాలను, జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై ఎవరు వచ్చినా ఆహ్వానించాల్సిందేనన్న చంద్రబాబు అభిమతం మేరకు గుర్నాథరెడ్డి చేరిక జరుగుతుందని పార్టీ నేతలు అంటున్నారు. కాగా, గుర్నాథరెడ్డి రేపు టీడీపీ కండువా కప్పుకుంటారని సమాచారం.