hyderabad metro rail: మెట్రో చార్జీలు ఎక్కువనుకుంటే ప్రజలు ఆదరించరు: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ఉబెర్, ఓలా క్యాబ్స్ కంటే ఛార్జీలు తక్కువగానే ఉన్నాయి
- ప్రజలు ఆదరించకపోతే ఎల్ అండ్ టీనే ఛార్జీలు తగ్గిస్తుంది
- విమర్శించడం కాంగ్రెస్ కు తగదు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ సంస్థకు 90 శాతం వాటా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మెట్రో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఉబెర్, ఓలా క్యాబ్స్ తో పోలిస్తే మెట్రో ఛార్జీలు తక్కువగానే ఉన్నాయని చెప్పారు.
ఏ మంచి పని జరిగినా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఎద్దేవా చేశారు. మెట్రో ఛార్జీలు ఎక్కువగా ఉంటే మొదటి రోజే ప్రజలు ఆదరించరు కదా? అని అన్నారు. మెట్రోను ప్రజలు ఆదరించకపోతే... ఎల్ అండ్ టీ ధరలను తగ్గిస్తుందని చెప్పారు. జీఈఎస్ సదస్సుకు కేటీఆర్ మాత్రమే వెళ్లారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం తగదని... పరిశ్రమల శాఖ మంత్రిగా మాత్రమే కేటీఆర్ హాజరయ్యారని తెలిపారు.