vishal: హీరో విశాల్ కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు!
- అన్బుచెళియన్ వేధింపులపై ఫిర్యాదు చేయాలన్న విశాల్
- విశాల్ కు వాట్స్ యాప్ లో జాతి, మత విద్వేష పదజాలంతో బెదిరింపులు
- ఇలాంటి వారి నుంచే సినీ పరిశ్రమను రక్షించాలన్న విశాల్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. కోలీవుడ్ లో నిర్మాత అశోక్ కుమార్ ఫైనాన్సియర్ల వేధింపులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై విశాల్ తీవ్రంగా స్పందించాడు. కోలీవుడ్ ను ఈ ఫైనాన్షియర్ల బారి నుంచి విముక్తం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో విశాల్ కు ఈ బెదిరింపులు ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ బెదిరింపులు పైనాన్షియర్ అన్బుచెళియన్ అనుచరులు చేసినట్టు నిర్మాత మణిమారన్ ఆరోపించారు. వాట్స్ యాప్ ద్వారా జాతి, మత విద్వేషాలు ప్రేరేపించేలా తీవ్రపదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామన్నారు.
కాగా, ఆశోక్ కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో అన్బుచెళియన్ బాధితులు తమకు ఫిర్యాదు చేయాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ప్రకటించారు. దీంతోనే ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై విశాల్ మాట్లాడుతూ, మతవిద్వేషాలు రేపడం ద్వారా ఈ కేసును పక్కదోవపట్టించాలని అన్బుచెళియన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారి నుంచే సినీ పరిశ్రమను రక్షించాలని ఆయన పేర్కొన్నారు.