Dean Jones: సెహ్వాగ్‌కు నేను వీరాభిమానిని.. కానీ ఇప్పుడు కాదు: ఆసీస్ మాజీ క్రికెటర్
- కోహ్లీలోని దూకుడు స్వభావం నన్ను అభిమానిగా మార్చింది
- విరాట్‌లోని అత్యుత్తమ ఆటగాడిని రవి బయటకు తీశాడు
- దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత్‌దే విజయం
టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు తాను ఒకప్పుడు వీరాభిమానినని, కానీ ఇప్పుడు అతడి స్థానాన్ని విరాట్ కోహ్లీ భర్తీ చేశాడని ఆసీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ డీన్ జోన్స్ పేర్కొన్నాడు. విరాట్ దూకుడుగా ఆడతాడని, అతడి స్వభావం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీకి ముందు తాను సెహ్వాగ్‌ను అభిమానించే వాడినని, అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌ను కోహ్లీ భర్తీ చేశాడని పేర్కొన్నాడు. కోహ్లీ ఎటువంటి పిచ్‌లపైన అయినా సులభంగా పరుగులు రాబడతాడని, దూకుడుగా ఆడతాడని జోన్స్ పేర్కొన్నాడు. అతడిలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీసింది కోచ్ రవిశాస్త్రేనని కితాబిచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ కోహ్లీ ఇదే రకమైన ప్రదర్శన కనబరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జట్టులో షమీ, అశ్విన్ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారని, బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే విజయం భారత సొంతమవుతుందని డీన్ జోన్స్ పేర్కొన్నాడు.