Hyderabad: స్మార్ట్ కార్డు ఉంది కదా అని మెట్రో స్టేషన్లో ఉన్నారో.. సొమ్ము గోవిందా!
- పెయిడ్ ఏరియాలో ఎంతసేపు ఉంటే అన్ని డబ్బులు చెల్లించాల్సిందే
- స్మార్ట్‌కార్డు ఉంది కదా అని చక్కర్లు కొడితే సొమ్ము స్వాహా
- తొలి రోజు అనుభవంతో కంగుతిన్న ప్రయాణికులు
హైదరాబాద్ వాసులు ఇప్పుడు మెట్రో మత్తులో జోగుతున్నారు. తొలి ప్రయాణం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. టికెట్ల కోసం ఎగబడుతున్నారు. స్టేషన్‌కు చేరుకున్న వెంటనే మొత్తం కలియదిరుగుతూ మెట్రో అందాలను వీక్షిస్తున్నారు. మెట్రో కార్డు చేతిలో ఉంది కదా అని చాలా మంది ఇదే పనిచేస్తూ ఆ తర్వాత తీరిగ్గా బాధపడుతున్నారు.
ప్రయాణం కోసం స్టేషన్లోకి ప్రవేశించాక పెయిడ్ ఏరియా నుంచి అరగంట లోపే బయటకు రావడం ఉత్తమం. లేదంటే మనకు తెలియకుండానే స్మార్ట్‌కార్డులోని సొమ్మంతా స్వాహా అయిపోతుంది. స్మార్ట్‌కార్డు కోసం రూ.200 చెల్లిస్తే అందులో రూ.100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే స్టేషన్లోకి ప్రవేశించాక రైలు ఎక్కకుండా అన్ని ప్రాంతాలు అలా చూసొద్దామని ఓ గంటసేపు అక్కడే తిరిగితే స్మార్ట్‌కార్డులోని సొమ్ము కరిగిపోతుంది.
ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌కు బుధవారం ఇదే అనుభవం ఎదురైంది. అలా తిరిగి ఇలా బయటకు వచ్చే ముందు చూసుకుంటే కార్డులో మిగిలింది కేవలం పన్నెండు రూపాయలే. రూ.88 మాయమవడంతో శ్రీనివాస్ అవాక్కయ్యాడు. స్టేషన్లో ఎవరైనా ఎక్కువసేపు గడిపితే జరిగేది ఇదే. స్మార్ట్కార్డుతో పెయిడ్ ఏరియాలోకి ప్రవేశించి రైలు ఎక్కకపోయినా చార్జీలు కట్ అవుతూనే ఉంటాయి. స్టేషన్లో ఉన్నంత సేపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సో.. మెట్రో ప్రయాణికులారా.. తస్మాత్ జాగ్రత!