Arunachal pradesh: బట్టలు తీసి నిలబడండి... కాగితం ముక్క కోసం 88 మంది అమ్మాయిలకు కస్తూర్బా గాంధీ స్కూలు శిక్ష!
- టీచర్ పై అసభ్య రాతలు రాసిన స్టూడెంట్
- ఆ కాగితం కోసం బట్టలూడదీయించిన టీచర్లు
- అరుణాచల్ ప్రదేశ్ లో దారుణం
- పోలీసులకు ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి
అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ స్కూల్ బాలికలకు అత్యంత దారుణమైన శిక్షను విధించింది. తమ క్లాస్ టీచర్ పై అసభ్యరాతలు రాశారన్న ఆరోపణలపై 88 మంది ఆరు, ఏడు తరగతుల అమ్మాయిలను బలవంతంగా బట్టలు తీయించి నిలబెట్టింది. పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా వైద్యశాలలో ఈ దారుణం జరిగింది. గత వారంలో ఈ ఘటన జరుగగా, బాధిత బాలికలు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఓ జూనియర్ టీచర్ కలిసి ఈ పని చేయించారు. క్లాస్ టీచర్ పై ఓ స్టూడెంట్ అసభ్యరాతలు రాయగా, ఆ కాగితం ముక్క కోసం మిగతా విద్యార్థుల ముందు బట్టలు ఊడదీయించారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని హెచ్చరించారు. ఈ ఘటన నిజమేనని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన దారుణమని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పాలన జరుగుతున్న తీరుకు ఇటువంటి ఘటనలు నిదర్శనమని పేర్కొంది.