Hyderabad: మెట్రో స్టేషన్ల కింద టూ వీలర్లు మాయం... సమీప పోలీసు స్టేషన్లకు తరలిస్తున్న పోలీసులు
- సరదాగా తిరిగి వచ్చేందుకు యువత ఆసక్తి
- ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేస్తున్న వైనం
- 100కు పైగా బైకులను తరలించిన పోలీసులు
హైదరాబాద్ లో సరదాగా మెట్రో రైలు ఎక్కి ఓ రౌండ్ వేసి వద్దామని, బైక్ పార్క్ చేసి, రైల్లో కాసేపు విహరించి వచ్చి చూసిన వారు గగ్గోలు పెడుతున్న పరిస్థితి నెలకొంది. మెట్రో స్టేషన్లలో ఇప్పటివరకూ వాహన పార్కింగ్ ఏర్పాట్లు ఎక్కడా జరగలేదన్న సంగతి తెలిసిందే. అయినా, పలువురు తమ వాహనాలను మెట్రో కారిడార్లలో, రోడ్ల మధ్యన, మెట్ల కింద పార్క్ చేసి ఎంచక్కా రైలెక్కి పోతున్నారు.
ఇక ఈ ఉదయం నుంచి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తగా, రంగంలోకి దిగిన పోలీసులు, అనధికారికంగా పార్కింగ్ చేసిన టూవీలర్లను సమీప పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో తమ వాహనాలు పోయాయని పదుల సంఖ్యలో హైదరాబాదీలు మెట్రో సిబ్బందితో వాదనలకు దిగుతున్నారు. ముఖ్యంగా అమీర్ పేట, బేగంపేట, ఎస్ ఆర్ నగర్ స్టేషన్లలో ఈ సమస్య అధికంగా ఉంది. ఇప్పటివరకూ 100కు పైగా బైకులను తరలించాల్సి వచ్చిందని, తొలి తప్పుగా వారిపై జరిమానాలు లేకుండానే వాహనాలను అప్పగించే అవకాశాలు పరిశీలిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.