hello: 'హలో' టీజర్ కాపీ రైట్ విషయం గురించి స్పష్టతనిచ్చిన అఖిల్!
- తప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అని వ్యాఖ్య
- మ్యూజిక్ విషయంలో తలెత్తిన వివాదం
- డబ్బులు చెల్లించకుండానే మ్యూజిక్ వాడేసిన అనూప్?
అక్కినేని అఖిల్ రెండో చిత్రం 'హలో' టీజర్ యూట్యూబ్‌లో అధికారిక లింక్ నుంచి మాయమైన సంగతి తెలిసిందే. మ్యూజిక్ కాపీరైట్ విషయంలో ఈ టీజర్‌ను తొలగించినట్లు యూట్యూబ్ చెబుతోంది. అయితే వేరే లింకుల్లో ఈ టీజర్ అందుబాటులో ఉన్నప్పటికీ సినిమా నిర్మాతలుగా కాపీరైట్ వివాదంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉంది కనుక వివరాలను వెల్లడిస్తున్నట్లు అఖిల్ ట్వీట్ చేశాడు.
'ఇప్పటికే చిత్ర టీజర్‌కి 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. హలో టీజర్ పై చేసిన కాపీ రైట్ క్లెయిమ్ గురించి చిత్ర నిర్మాతలుగా మేం స్పందించాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన నేపథ్య సంగీతం కోసం మేం రియల్లీ స్లో మోషన్‌తో పనిచేసినందుకు గర్వపడుతున్నాం. ఎలాంటి కారణం లేకుండా అనవసర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు' అని అఖిల్ ట్వీటాడు.
అయితే టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారు చేసే ఫిన్లాండ్కి చెందిన ఎపిక్ నార్త్ అనే సంస్థ ఈ కాపీరైట్ క్లెయిమ్ వేసింది. చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ డబ్బులు చెల్లించకుండానే ఈ కంపెనీకి చెందిన ఎక్సోసూట్ అనే మ్యూజిక్‌ని టీజర్ కోసం ఉపయోగించినట్లు తెలుస్తోంది.