bay of bengal: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. పెను తుపానుగా మారే అవకాశం.. తమిళనాడుకు భారీ వర్ష సూచన!
- కన్యాకుమారికి 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
- రాత్రికి పెను తుపానుగా మారనున్న వాయుగుండం
- ఇప్పటికే అతలాకుతలం అయిన కన్యాకుమారి
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని గాలేకి 240 కిలోమీటర్లు, తమిళనాడులోని కన్యాకుమారికి 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ రాత్రికి ఇది పెను తుపానుగా మారబోతోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర-పడమర దిశగా ఇది కదులుతుందని చెప్పారు. ఈ సైక్లోన్ కారణంగా దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, ట్యూటికోరిన్, రామనాథపురం, శివగంగ, విరుత్తునగర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. నాగపట్నం, తంజావూరు, తిరువావూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులు కూడా ఉంటాయని చెప్పారు. కేరళపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ తుపానుకు 'ఓక్కి' అని నామకరణం చేశారు.
ఇప్పటికే ఓక్కి కన్యాకుమారిపై ప్రభావం చూపింది. వర్ష ప్రభావంతో 2 వేలకు పైగా చెట్లు, 985 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాలను చేపట్టారు.