Narendra Modi: రాజకీయంగా నా భవిష్యత్తును త్యాగం చేసేందుకు కూడా సిద్ధం: ప్రధాని మోదీ
- హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సుకి హాజరైన మోదీ
- నా నిర్ణయాల వల్ల ఎటువంటి పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చినా స్వీకరిస్తా
- నా లక్ష్యాలను సాధించే క్రమంలో వెనుకంజ వేయబోను
- ఇప్పుడు బ్లాక్ మనీ దేశ ఆర్థిక వ్యవస్థలో కలిసిపోయింది
సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతోన్న ప్రధాని నరేంద్ర మోదీ.. తాను తీసుకుంటోన్న నిర్ణయాలపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సుకి హాజరైన మోదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన నిర్ణయాల వల్ల ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చినా తాను వాటిని స్వీకరిస్తానని ఉద్ఘాటించారు. అంతేగాక, రాజకీయంగా తన భవిష్యత్తును కూడా త్యాగం చేసేందుకు సిద్ధమని తెలిపారు.
తమ ప్రభుత్వ ధ్యేయం అభివృద్ధేనని మోదీ చెప్పారు. అవినీతిని అంతమొందించడానికి, దేశాభివృద్ధి కోసం తన లక్ష్యాలను కొనసాగిస్తానని, ఎన్నటికీ వదులుకోబోనని తెలిపారు. తాను తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ముందు దేశంలో బ్లాక్ మనీ ఓ సమాంతర ఆర్థిక వ్యవస్థగా కొనసాగిందని చెప్పారు. ఇప్పుడు బ్లాక్ మనీ దేశ ఆర్థిక వ్యవస్థలో కలిసిపోయిందని తెలిపారు. డిమోనిటైజేషన్ అనంతరం సేకరించిన డేటా ఆధారంగా అవినీతిపరుల వివరాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. అలాగే ఆధార్ కార్డు అనుసంధానంతో బినామీ వ్యవస్థను నాశనం చేయవచ్చని అన్నారు. నల్లధనం ఉన్నవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు.