nagarjuna university: నాడు చదువుకోవడానికి సీటివ్వని నాగార్జున విశ్వవిద్యాలయంలో నేనిప్పుడు అతిథిని!: సుద్దాల అశోక్ తేజ
- యుక్త వయసులో సీటివ్వని నాగార్జున వర్శిటీ
- యువతలో మానవత్వం పెరగాలి
- యువజనోత్సవాల ముగింపులో సుద్దాల అశోక్
తన యుక్త వయసులో నాగార్జున వర్శిటీలో చదువుకోవాలని దరఖాస్తు చేసుకోగా, సీటు రాలేదని, ఆపై రెండు దశాబ్దాల తరువాత, ఇక్కడ జరుగుతున్న యువజనోత్సవాలకు అతిథిగా రావడం ఎంతో సంతోషంగా ఉందని సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ వ్యాఖ్యానించారు. నాగార్జున వర్శిటీలో జరుగుతున్న యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో సుద్దాల పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవత్వ విలువలపై తనకు ఎదురైన ఓ అనుభవాన్ని వివరించారు. సినిమాల్లో రాణించిన తరువాత తాను కారు కొని విజయవాడకు వస్తుండగా, ఓ బాలుడు కారుపై రాయి వేశాడని, ఎందుకు రాయి వేశావని అడిగితే, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ వాహనాన్ని ఆపడం లేదని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. ఆపై బాధితుడు ఏమవుతాడని అడిగితే, తనకేమీ కాడని చెప్పాడని, వెంటనే ఆ వ్యక్తిని తాను కారులో ఆసుపత్రికి తరలించానని అన్నారు. బాలుడు చూపిన మానవత్వం ప్రతి ఒక్కరూ చూపాల్సి వుందన్నారు. కొన్ని పాటలు పాడిన సుద్దాల, యువతను కేరింతలు కొట్టించారు. వర్శిటీ అధికారులు ఈ సందర్భంగా సుద్దాలను సత్కరించారు.