India: బీసీసీఐపై న్యాయపోరాటానికి దిగిన పాక్.. రూ.452 కోట్ల పరిహారం కోరుతూ ఐసీసీకి ఫిర్యాదు
- ఎంవోయూకు భారత్ తూట్లు పొడిచిందని ఆరోపణ
- పరిహారం కోసం ఐసీసీని ఆశ్రయించిన పాక్
- 2007 తర్వాత పాక్‌తో క్రికెట్ సంబంధాలు తెంచుకున్న భారత్
భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) న్యాయపోరాటానికి దిగింది. ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందుకు గాను పరిహారంగా 70 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.452 కోట్లు) చెల్లించాలని ఆదేశించాల్సిందిగా కోరుతూ అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ)ని ఆశ్రయించింది.
ఎంవోయూ కుదుర్చున్న ప్రకారం 2014, 2015లో పాకిస్థాన్‌తో భారత్ రెండు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉండగా ఎంవోయూకు భారత్ తూట్లు పొడిచిందని ఆరోపించింది. పీసీబీ నుంచి తమకు ఫిర్యాదు అందినట్టు ఐసీసీ స్పష్టం చేసింది. పీసీబీ లాయర్ల నుంచి తమకు నోటీసు అందిందని, వచ్చే వారం దానిని వివాదాల పరిష్కార కమిటీకి పంపుతామని ఐసీసీ అధికార ప్రతినిధి తెలిపారు.
2007 నుంచి భారత్-పాక్‌ల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. 2008లో ముంబై దాడుల తర్వాత పాక్‌తో దౌత్య, క్రికెట్ సంబంధాలను భారత్ తెంచుకుంది.