BJP: నమ్మకంతో ప్రాజక్టు అప్పగిస్తే ఇంత పని చేస్తారా?: చంద్రబాబుపై విరుచుకుపడ్డ బీజేపే నేత సోము వీర్రాజు
- ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కదారి పట్టించి కేంద్రంపై విమర్శలా
- సానుకూలంగా ఉంటున్నా విమర్శలు గుప్పిస్తున్నారు
- బీజేపీ నేత సోము వీర్రాజు
పోలవరం ప్రాజెక్టును నిబద్ధతతో పూర్తి చేస్తారన్న నమ్మకంతో చంద్రబాబు చేతుల్లో ప్రాజెక్టును పెడితే, ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కదారి పట్టించి, కేంద్రంపై విమర్శలు చేయడం ఎంతవరకూ సమంజసమని బీజేపీ నేత సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. కేంద్రం వద్ద టీడీపీ అసలు విషయాలను దాచి పెట్టి, కేవలం సాంకేతికపరమైన అంశాలతో లేఖను రాయడం తగదని అన్నారు. గుత్తేదారులను మార్చాలన్న ఆలోచన వెనుక దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి, సంబంధిత మంత్రులకు చేరవేస్తూనే ఉన్నామని, చంద్రబాబు వైఖరిపై వారు కూడా సీరియస్ గానే ఉన్నారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం సమయంలోనే నిర్వాసితుల సమస్య కూడా వచ్చి భారం పెరుగుతోందన్న విషయం తమకు తెలుసునని, ఈ విషయంలో కేంద్రం వద్దకు వెళ్లి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తాము సానుకూలంగా వ్యవహరించాలని భావిస్తున్నప్పటికీ, తమపై విమర్శలు గుప్పిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. సోషల్ మీడియాలో వక్రీకరించి బీజేపీపై విమర్శలు చేయిస్తుండటం బాధను కలిగిస్తోందని అన్నారు.