padmavati: 'పద్మావతి' కథ కల్పితమైనప్పుడు అసలు పేర్లు ఎందుకు వాడావ్?: భన్సాలీకి పార్లమెంట్ ప్యానల్ ప్రశ్న
- పార్లమెంటరీ ప్యానల్ ముందుకు భన్సాలీ, జోషి
- ఎమోషనల్ అంశంతో వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్న
- సెన్సార్ బోర్డు కలగజేసుకోవడమే బెస్ట్ అన్న అద్వానీ
'పద్మావతి' సినిమాకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. పార్లమెంటరీ ప్యానల్ ముందు ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషిలు హాజరై తమ వాదనలను వినిపించారు. 'సతీ' ఆచారాన్ని చూపించడం, సెన్సార్ బోర్డు కంటే ముందే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు సినిమాను చూపించడం వెనకున్న అంతరార్థం ఏంటో చెప్పాలని ప్యానల్ సభ్యులు అడగగా... భన్సాలీ నీళ్లునమిలినట్టు సమాచారం. చిత్రం విడుదలలో జాప్యం జరగడం మూలాన తాను నష్టపోతున్నానని భన్సాలీ చెప్పగా... ఎమోషనల్ అంశంతో వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అంటూ ప్యానల్ సభ్యులు ప్రశ్నించారు.
సినిమా కల్పితమని చెబుతున్నప్పుడు, అసలైన పేర్లను సినిమాలో ఎందుకు వాడారంటూ సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశ్నించారు. సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కూడా ఈ విషయాన్ని తమకు తెలియజేయలేదని సీబీఎఫ్సీ సభ్యులు చెప్పగా... ప్యానల్ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కల్పించుకుని అలాంటప్పుడు ట్రైలర్ విడుదలకు అనుమతి ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో పార్లమెంటరీ ప్యానల్ కన్నా సెన్సార్ బోర్డు కలగజేసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇరు పక్షాల వాదనలను విన్న అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందిస్తామని తెలిపింది. మరోవైపు, ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది సినిమా ఎలా అవుతుందని ఓ ప్రకటనలో ఠాకూర్ ప్రశ్నించారు.