Chandrababu: రాష్ట్ర ప్రజలారా చూడండి.. దోపిడీ కోసం స్వార్థంతో ఏం చేస్తున్నారో.. మేము ఊరుకోం!: పోలవరంపై బొత్స
- స్వార్థపర నాయకత్వం ఉంటే ఇంతే
- ఏపీని చంద్రబాబు నిలువునా ముంచారు
- దండం పెట్టి పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వానికే అప్పజెప్పుతామంటున్నారు
- నిర్ణీత కాలంలోనే ఈ ప్రాజెక్టు పూర్తికావాలి
ఆంధ్రప్రదేశ్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలువునా ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... నిర్ణీత కాలంలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని డిమాండ్ చేశారు. ఒక మంచి నాయకుడు లేకపోతే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చంద్రబాబు నాయకత్వంలో తెలుస్తోందని తెలిపారు. స్వార్థపరమైన నాయకత్వం వల్లే పోలవరం విషయంలో ఇలా జరుగుతోందని చెప్పారు. పోలవరం నిర్మాణంలో ఎందుకు అవకతవకలు చేస్తున్నారని ప్రశ్నించారు. మరోపక్క, ప్రతిపక్షాలకి అభివృద్ధి అంటే పడదని, ప్రాజెక్టుని అడ్డుకుంటున్నారని తమపై నిందలు వేయడం ఏంటని ఆయన నిలదీశారు.
'రాష్ట్ర ప్రజలారా చూడండి.. దోపిడీ కోసం స్వార్థంతో ఏం చేస్తున్నారో.. రాష్ట్రాన్ని నట్టేట ముంచారు. తమను నిర్మించవద్దని చెబితే, దండం పెట్టి పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వానికే అప్పజెప్పుతామని అంటున్నారు.. మీరే కదా బతిమిలాడి పోలవరం ప్రాజెక్టు పనుల బాధ్యతను తీసుకున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు పారదర్శకంగా ఎందుకు ఉండడం లేదు? ప్రజలకు ఏమీ తెలియదు, ఏమీ అడగరని అనుకుంటున్నారా? ఏంటిది? స్వలాభాలు, అవినీతి పరాకాష్ఠకు వెళ్లిపోయాయి. దానికి ఉదాహరణే పోలవరం. అసలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది? వీటికి తెలుగుదేశం పార్టీ సమాధానాలు చెప్పాలి. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మించాలి, లేదంటే మేము ఊరుకోం. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం' అంటూ బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.