bc: ఇక బీసీలకు ఒక్కరికి కూడా ఉద్యోగం రాదు.. ఉద్యమానికి సిద్ధంకండి!: 'కాపు రిజర్వేషన్'పై ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
- అసెంబ్లీలో అడ్డుకోవాలి
- రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం
- ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుని, బీసీల అవకాశాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బీసీ జాతికి విలువ లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ చాలా మంది బీసీలకు ఉద్యోగాలు దొరకడం లేవని అన్నారు.
ఒకవేళ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తెస్తే కనుక, నిజమైన బీసీలకు ఒక్కరికి కూడా ఉద్యోగం రాదని ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇక బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు గట్టిగా దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.