Mukesh Ambani: 'ఫ్రెండ్' అంటూనే ఎయిర్‌టెల్ చీఫ్ మిట్టల్‌కు ముకేశ్ అంబానీ చురకలు!
- టెలికం రంగంలో నష్టాలకు జియోను నిందించడం సరికాదన్న అంబానీ
- లాభాల కోసం రెగ్యులేటరీలు, ప్రభుత్వాలపై చూడడం మానుకోవాలని సూచన
- దేశానికి లాభం జరుగుతున్నప్పుడు నష్టాలను స్వీకరించడం కూడా ఆనందమేనన్న జియో చీఫ్
ఢిల్లీలో జరిగిన హెచ్‌టీ నాయకత్వ సదస్సులో రిలయన్స్ జియో చీఫ్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కు చురకలంటించారు. జియో కారణంగానే టెలికం రంగం నష్టాల్లో కూరుకుపోయిందన్న మిట్టల్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. లాభాల కోసం రెగ్యులేటరీలు, ప్రభుత్వాలవైపు ఆశగా చూడడం మానుకోవాలని సూచించారు. టెలికం పరిశ్రమ నష్టాలకు జియోను నిందించడం సరికాదని పేర్కొన్నారు.
మిట్టల్‌ను ‘ఫ్రెండ్’గా పేర్కొన్న అంబానీ వ్యాపారంలో సాహసాల ఫలితంగానే లాభనష్టాలు వస్తాయన్న సంగతి మర్చిపోకూడదన్నారు. జియో రంగ ప్రవేశం తర్వాత దేశం, వినియోగదారులు లాభ పడ్డారా? లేదా? అన్నదే ఇక్కడ ముఖ్యమన్నారు. జియో వచ్చాక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో భారత్ నంబర్ వన్ స్థానానికి చేరుకుందని, అమెరికా, చైనాలో కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్నారని ముకేశ్ వివరించారు.
‘‘ఇండస్ట్రీలో ఉన్న మనమంతా లాభనష్టాలను సమానంగా స్వీకరించాలనేది నా అభిప్రాయం. వ్యాపారాన్ని మనం నిర్వహించే దాన్నిబట్టే లాభనష్టాలు వస్తాయి. అంతేకానీ, లాభాల కోసం నియంత్రణ సంస్థలు, ప్రభుత్వాలపై చూడడం సరికాదు. నా వరకు వస్తే జియో వచ్చిన తర్వాత దేశం పురోగతి సాధించిందా? ప్రజలు లాభపడ్డారా? లేదా? అన్నదే ముఖ్యం’’ అని పేర్కొన్నారు.
‘‘వ్యాపారంలో లాభనష్టాలు సహజమన్నప్పుడు గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్న సందేహం మీకు రావచ్చు. వినియోగదారులు లాభపడి, దేశం ముందుకు పోతున్నప్పుడు నష్టాలను భరించడం కూడా నాకు ఆనందమే’’ అని ముకేశ్ స్పష్టం చేశారు.
గతేడాది జియో మార్కెట్లోకి వచ్చాక టెలికం రంగ స్వభావమే మారిపోయింది. జియో దెబ్బకు పోటీ టెల్కోలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు తమ ఖాతాదారులను కాపాడుకునేందుకు టారిఫ్‌లను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆఫర్లు ప్రకటించాల్సి వచ్చింది. ఫలితంగా టెలికం రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. దీనికి జియోనే కారణమని ఇటీవల ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఆరోపించారు.