Ivanka Trump: హైదరాబాద్లో ఇవాంకా ప్రసంగంపై విమర్శలు.. గత ప్రసంగాన్ని రీసైకిల్ చేశారంటూ మీడియా కథనాలు!
- తన ప్రసంగాన్ని తానే కాపీ కొట్టారన్న ‘న్యూస్వీక్’
- కొన్ని వాక్యాలు తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ అని విమర్శలు
- ‘న్యూస్వీక్’ కథనంపై మండిపడుతున్న నెటిజన్లు
హైదరాబాద్లో నిర్వహించిన ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొన్న ఇవాంకా ట్రంప్ చేసిన ప్రసంగంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంపై అమెరికాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత నెల 2న టోక్యోలో జరిగిన వరల్డ్ అసెంబ్లీ ఫర్ విమెన్ (వావ్)’లో చేసిన ప్రసంగాన్నే కాస్త అటు ఇటుగా మార్చి హైదరాబాద్లో ఇవాంకా చదివేశారని ‘న్యూస్వీక్’ పత్రిక పేర్కొంది. ఆమె ప్రసంగంలోని కొన్ని చిన్నచిన్న పదాలు తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్ అని పేర్కొంది.
‘‘ఈ ముత్యాల నగరిలో గొప్ప నిధి మీరే’’లాంటి చిన్నచిన్న పదాలు మాత్రమే కొత్తగా వాడారని, ‘‘మహిళలు పనిచేస్తే దాని ప్రభావం ద్విగుణీకృతం అవుతుంది. పురుషుల కంటే మహిళలే మహిళలకు ఎక్కువ ఉపాధి ఇవ్వగలుగుతారు’’ అన్న వాక్యాలను పూర్తిగా టోక్యో ప్రసంగం నుంచి యథాతథంగా తీసుకున్నారని కథనంలో పేర్కొంది. మహిళలు వారి సంపాదనను తిరిగి సమాజంలోనే పెట్టుబడిగా పెడతారన్న వాక్యాలు కూడా అక్కడివేనని వివరించింది.
‘ఇవాంకా ట్రంప్ రీసైకిల్స్ హెర్ ఓన్ స్పీచ్ ఇన్ ఇండియా‘ శీర్షికతో న్యూస్ వీక్’ ప్రచురించిన కథనంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు ప్రసంగించేటప్పుడు కొన్ని వాక్యాలు పునరావృతం కావడమనేది చాలా సహజమైన విషయమని, దానిని తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ ఇవాంకాను వెనకేసుకొస్తున్నారు.