Triple Talak: తలాక్ అంటే మూడేళ్ల జైలు.. 1986 చట్టంలో మార్పులు!
- ముసాయిదా చట్టాన్ని రూపొందించిన కేంద్రం
- రాష్ట్రాల అభిప్రాయం కోరిన న్యాయశాఖ
- బిల్లు చట్టంగా మారితే దేశవ్యాప్తంగా అమలు
ముస్లిం మహిళల (రక్షణ, విడాకుల హక్కులు) చట్టం 1986లో పలు మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా ముమ్మారు తలాక్ చెప్పేవారిని జైలుకు పంపి కఠినంగా శిక్షించాలని యోచిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లు చట్టంగా మారితే మహిళలకు చాలావరకు రక్షణ లభిస్తుందని కేంద్రం చెబుతోంది. తలాక్ చెప్పే వారికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు భారీగా జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. న్యాయశాఖ, కేంద్ర హోంశాఖ కలిసి దీనిని రూపొందించాయి.
బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్టంగా రూపాంతరం చెందితే ‘ట్రిపుల్ తలాక్’ను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. తలాక్ చెప్పేవారికి మూడేళ్ల జైలు, జరిమానా, లేదంటే రెండూ విధిస్తారు. మంత్రుల బృందంతో చర్చించి, రాష్ట్రాల అభిప్రాయం కూడా తీసుకున్నాక తుది ముసాయిదాను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. తయారైన ముసాయిదాను శుక్రవారమే రాష్ట్రాలకు పంపించిన కేంద్ర న్యాయశాఖ వారి అభిప్రాయాలను కోరింది. ముసాయిదాకు ఆమోదం లభిస్తే జమ్ముకశ్మీర్ మినహా దేశమంతా కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.