Narendra Modi: 'ఇస్తామన్న ప్రోత్సాహకాలు ఇవ్వలేదు..' అంటూ భారత ప్రధానిపై కేసు వేసిన జపాన్ కార్ల కంపెనీ నిస్సాన్!
- భారత ప్రభుత్వం తమకు రూ.5 వేల కోట్లు బకాయిపడిందన్న నిస్సాన్
- ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్‌కు..
- ఈ నెల రెండో వారంలో విచారణ
జపాన్‌కు చెందిన వాహన తయారీ దిగ్గజం నిస్సాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి లీగల్ నోటీసు పంపింది. భారత్‌లో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసే సమయంలో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి, ఆ హామీని ఉల్లంఘించినందుకు గాను ఈ నోటీసు పంపింది.
నిస్సాన్ 2008లో తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో పలు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం-నిస్సాన్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం వాటి గురించి మర్చిపోయింది. దీంతో బకాయి ప్రోత్సాహకాలను ఇప్పించాల్సిందిగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు 2016లో నిస్సాన్ చైర్మన్ కార్లోస్ ఘోస్ ప్రధానికి లేఖ రాశారు. తమకు రావాల్సిన ప్రోత్సాహకాల పన్ను బకాయిలు 700 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5వేల కోట్లు) వరకు ఉన్నాయని, జోక్యం చేసుకుని ఇప్పించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు.
ప్రధానికి లేఖ రాసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో గతేడాది జూలైలో ప్రధాని మోదీకి నిస్సాన్ నోటీసులు పంపింది. స్పందించిన కేంద్రం.. తొందర పడవద్దని, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని, న్యాయస్థానం వరకు వెళ్లవద్దని నిస్సాన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. దీనికి తిరస్కరించిన నిస్సాన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ (అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం)లో కేసు వేసింది. ఈ నెల రెండో వారం తర్వాత అక్కడ విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇదే విషయంపై తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఆర్బిట్రేటర్ వద్దకు వెళ్లకుండానే సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని తెలిపింది. కాగా, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో భారత్‌పై 20 కేసులు ఉన్నాయి. ప్రపంచంలో మరేదేశంపైనా ఇన్ని కేసులు లేవు.