r krishnaiah: కాపులకు రిజర్వేషన్లు ఆచరణలో సాధ్యం కాదు: బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య
- హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు
- చట్టపరమైన సమస్యలు వస్తాయి
- రాజకీయ లబ్ధి కోసం ఇరు రాష్ట్రాల్లో రిజర్వేషన్లను పెంచుతున్నారు
కాపులను బీసీల్లో చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసినా... ఆచరణలో అది సాధ్యం కాదని... రాబోయే కాలంలో చట్టపరంగా, న్యాయపరంగా సమస్యలు తలెత్తుతాయని బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ తీర్మానం చెల్లదని చెప్పారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించాలంటూ మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వగానే హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారని... దీనిపై డిబేట్ జరిగి ఉండాల్సిందని అన్నారు. కాపులకు రిజర్వేషన్లను కల్పించడం అంటే బీసీలను మోసం చేయడమేనని చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసమే ఏపీ, తెలంగాణల్లో రిజర్వేషన్లను పెంచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుండటం దారుణమని అన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కాకుండా... జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్లను కల్పించాలన్న ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జనాభాలో 52శాతం మంది బీసీలు ఉన్నారని... మరి వారికి అంత శాతం రిజర్వేషన్లు లేవు కదా? అని ప్రశ్నించారు.