ias: 'చేయి' లేకపోయినా పట్టు వదల్లేదు.. ఐఏఎస్ పాసై ఆద‌ర్శంగా నిలిచాడు!

  • విద్యుత్ షాక్‌తో చేయి కోల్పోయిన గిరీషా
  • మూడో ప్ర‌య‌త్నంలో ఐఏఎస్‌
  • ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు

దివ్యాంగులంటే స‌మాజంలో ఒక ర‌క‌మైన చిన్న‌చూపు ఉంటుంది. ప్ర‌భుత్వాధికారులు కూడా వారి వైక‌ల్యాన్ని చూసి క‌నిక‌రించరు. ప్ర‌భుత్వ సేవ‌ల‌ను అందించ‌డం కోసం వారిని కావాల‌ని తిప్పించుకునే అధికారులు ఉంటారు. అలా ఇబ్బందులు ప‌డిన ఓ వ్య‌క్తి, గ‌ట్టి సంక‌ల్పంతో చ‌దివి ఇప్పుడు ప్ర‌భుత్వాధికారి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. తాను దివ్యాంగుడిగా మారిన‌ప్పుడు ఎదుర్కున్న స‌మ‌స్య‌లే త‌న‌కు దారి చూపాయ‌ని, ఆ స‌మ‌స్య‌లు మ‌రొక‌రికి ఎదురు కాకుండా చూసుకోవ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని అంటున్నాడు గిరీషా.

క‌ర్ణాట‌కలోని మండ్యా జిల్లా పిట్టేకొప్ప‌లు గ్రామానికి చెందిన గిరీషా, ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో జ‌న్మించాడు. నాన్న శివరామేగౌడ, అమ్మ రత్నమ్మ. గిరీషా కూడా వ్య‌వ‌సాయంలో త‌న వంతు స‌హాయం చేసేవాడు. ఆ త‌ర్వాతే చ‌దువుకునేవాడు. హోం వ‌ర్క్ పూర్తి చేయ‌నిదే ఇంట్లో అన్నం ఉండ‌ద‌ని తండ్రి ఇచ్చిన ఆదేశాలే ఇప్పుడు త‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పునాది అని అంటాడు గిరీషా.

అలా సాగిపోతున్న జీవితంలో విద్యుత్ షాక్ రూపంలో గిరీషాకు అనుకోని షాక్ త‌గిలింది. తొమ్మిదో త‌ర‌గ‌తిలో ఉన్న గిరీషా రెండు చేతులు చచ్చుబ‌డిపోయాయి. కుడి చేయి తొలగించాల్సి వచ్చింది. తొమ్మిది శస్త్రచికిత్సల అనంత‌రం ఎడ‌మ చేయి ప‌నిచేసింది. స‌హాయకుడితో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాయించాల్సి వ‌చ్చింది. కానీ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వ‌చ్చేస‌రికి ఎడమచేత్తో రాయ‌డం అల‌వాటు చేసుకున్నాడు.

త‌ర్వాత త‌ల్లి కోరిక మేరకు వైద్యుడు కావాలని ప్రవేశపరీక్ష రాశాడు. మైసూర్‌లో ఎంబీబీఎస్ సీటు కూడా వ‌చ్చింది కానీ ఒంటి చేత్తో వైద్యం సాధ్యం కాదని తెలిసి వదులుకున్నాడు. అనంత‌రం దివ్యాంగుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే ఐదొందల రూపాయల పింఛనుతో జీవిస్తూ సివిల్స్‌కి సిద్ధమయ్యాడు. 2010లో మొదటి ప్రయత్నంలోనే ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ రాగా, రెండో ప్రయత్నం వృథా అయింది. ఇక మూడో ప్రయత్నంలో 2012లో ఐఏఎస్‌ వరించింది. ముస్సోరిలో శిక్షణ అనంతరం తొలి పోస్టింగ్‌ నెల్లూరు జిల్లా గూడూరులో వ‌చ్చింది. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా జేసీగా గిరీషా ప‌నిచేస్తున్నాడు.

  • Loading...

More Telugu News