North Korea: అమెరికా భయపడిపోయుండొచ్చు: ఉత్తరకొరియా
- అత్యంత శక్తిమంతమైన క్షిపణి పరీక్ష విజయవంతం
- ఉత్తరకొరియాలో మిన్నంటిన సంబరాలు
- పండుగ చేసుకున్న ప్రజలు, సైనికులు
- ఇకపై మా దేశ హక్కులను ఎవ్వరూ అడ్డుకోరు
అమెరికా, జపాన్ లాంటి దేశాలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ యుద్ధ భయం రేపుతోన్న ఉత్తర కొరియా తాజాగా అత్యంత శక్తిమంతమైన మరో ఖండాంతర క్షిపణిని పరీక్షించిన విషయం తెలిసిందే. అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా అది సర్వ నాశనం చేయగలదని నిపుణులు అంటున్నారు. తాజా క్షిపణి విజయవంతం కావడంతో ఉత్తరకొరియా ఆనందం మిన్నంటింది.
ఆ దేశ ప్రజలు బాణసంచా పేలుస్తూ పండుగ చేసుకున్నారు. డ్యాన్సులు వేస్తూ కేరింతలు కొట్టారు. ఈ విషయాన్ని ఉత్తరకొరియా మీడియా పేర్కొంది. ఉత్తరకొరియా అధికార పార్టీ నడిపే పత్రికలోనూ ఈ విషయాన్ని తెలిపారు. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లోని కిమ్ ఈ సంగ్ స్క్వేర్ వద్ద వేల సంఖ్యలో సైనికులు పండుగ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆ దేశ అధికార పార్టీ నిర్ణయాత్మక కమిటీ వైస్ ఛైర్మన్ పాక్ క్వాంగ్ హో మాట్లాడుతూ... తమ దేశ అణుశక్తిని చూసి అమెరికా భయపడిపోయుండొచ్చని, ఇకపై తమ దేశ హక్కులను ఎవ్వరూ అడ్డుకోరని చెప్పారు. ఉత్తరకొరియా తాజా క్షిపణి పరీక్ష నేపథ్యంలో ఆ ప్రాంతంలో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు కూడా వచ్చాయి.