dharmendra: నేటి సినీ పరిశ్రమ కూరగాయల అంగడిని తలపిస్తోంది: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర
- నటీనటులు డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు
- ఆయిల్ మసాజ్‌లకు కూడా వెనుకాడటం లేదు
- మా రోజుల్లో వేరేలా ఉండేది
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ప్రస్తుత సినీ పరిశ్రమ స్థితిగతులను, తమ కాలంలోని పరిస్థితులతో పోల్చి వ్యాఖ్యానించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. `ప్రస్తుతం సినీ పరిశ్రమ కూరగాయల మార్కెట్లా మారిపోయింది. కొనడం, అమ్మడం, బేరాలు ఆడటంతోనే నటీనటులు సరిపెట్టుకుంటున్నారు. డబ్బు కోసమే ఆడుతున్నారు, పాడుతున్నారు. డబ్బు ఎక్కడ ఉన్నా వెళ్లడానికి వెనుకాడటం లేదు. చివరికి ఆయిల్ మసాజ్‌లకు కూడా ఒప్పుకుంటున్నారు` అంటూ చురకలు వేశాడు.
తమ కాలంలో ఇలా ఉండేది కాదని ఆయన అన్నారు. దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర ఈ రకమైన వ్యాఖ్యలు చేశారంటే ఆలోచించాల్సిన విషయమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అవార్డుల గురించి కూడా మాట్లాడుతూ - `కొన్ని విషయాల గురించి చర్చించకపోవడమే మంచిది. అవార్డుల విషయం కూడా అలాంటిదే. సినిమాలో నటించామా!... అది హిట్టయిందా!... ప్రేక్షకులు మెచ్చుకున్నారా!... ఇదే ముఖ్యం!... అదే పెద్ద అవార్డు` అని ధర్మేంద్ర అన్నారు.