Cricket: పొలార్డ్ నన్ను అరెస్టు చేయించబోయాడు: హార్డిక్ పాండ్య
- ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన కీరన్ పొలార్డ్, హార్డిక్ పాండ్య
- వెస్టిండీస్ పర్యటనలో పోలీస్ తో అరెస్టు చేయించబోయిన పొలార్డ్
- నీ సిటీలో నువ్వు పక్కనుండగా ఏమీ జరగదన్న నమ్మకం ఉంది భాయ్
వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్ తనను అరెస్టు చేయించబోయాడని టీమిండియా ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్య తెలిపాడు. హిందీ టీవీ వ్యాఖ్యాత గౌరవ్ కపూర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్ (బీడబ్ల్యూసీ) లో భాగంగా తనపై పోలార్డ్ ప్లే చేసిన ప్రాంక్ గురించి చెబుతూ, ఐపీఎల్ లో ముంబై జట్టుకు ఆడినప్పుడు పొలార్డ్ తో తనకు మంచి స్నేహం ఉందని అన్నాడు. తామిద్దరం ఆల్ రౌండర్లు కావడంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పాడు.
దీంతో గతంలో వెస్టిండీస్ లో వన్డేలు ఆడేందుకు వెళ్లగా, ఒకసారి పొలార్డ్ తో బయటకు వెళ్లానని చెప్పాడు. ఆ సమయంలో ఒక పోలీస్ అధికారి తన దగ్గరికి వచ్చి, 'యూ ఆర్ అండర్ అరెస్ట్' అన్నాడు. అతనలా అనగానే ఆందోళన మొదలైంది, పొలార్డ్ కూడా ఏమీ మాట్లాడలేదు. అయితే ఏ తప్పూ చేయనప్పుడు అరెస్టు ఏంటి? అని ఆలోచనలో పడి, జట్టు మేనేజ్ మెంట్ కి ఫోన్ చేయాలని అనుకున్నానని తెలిపాడు.
పక్కనే ఉన్న పొలార్డ్ 'ఏంటి? ఏమీ మాట్లాడడం లేదు?' అన్నాడు. దీంతో 'నీ సిటీలో నువ్వు పక్కనుండగా ఏమీ జరగదన్న నమ్మకం ఉందన్నా' అని గాంభీర్యం ప్రదర్శించా. అప్పుడు కానీ వారిద్దరూ తనను ఆటపట్టించారని అర్థం కాలేదని హార్డిక్ పాండ్య తెలిపాడు. తనను భయపెట్టిన ప్రాంక్ అదేనని హార్డిక్ వెల్లడించాడు.