kapu: కాపులకు రిజర్వేషన్లపై స్పందించిన ముద్రగడ!
- ఐదు శాతానికి అంగీకరించం
- కాపుల రిజర్వేషన్ను తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలి
- మేము పోరాడుతుంటే మా వెనుక మోదీ, జగన్ ఉన్నారన్నారు
- ఇకనైనా ఆరోపణలు మానుకోవాలి
ఏపీలో కాపులు కోటి మంది ఉంటే 50 లక్షల మందేనని పల్స్ సర్వేలో చూపించారని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆరోపణలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లపై స్పందించారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు సరిపోవని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు భోజనం పెడతామని చెప్పి టిఫిన్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాపులు పోరాటం చేసి రిజర్వేషన్ సాధించుకున్నారని, కానీ ఈ 5 శాతం మాత్రం సరిపోదని ముద్రగడ వ్యాఖ్యానించారు. తాము పోరాటం చేస్తోంటే తమ వెనుక మోదీ, జగన్ ఉన్నారంటూ కొందరు అన్నారని, ఇకనైనా తమపై ఆరోపణలు చేయించడం మానుకోవాలని ఆయన కోరారు. అసెంబ్లీలో కాపులకు బిల్లు పెట్టి ఆమోదించినంత మాత్రాన కాపులకు ప్రయోజనాలు ఏమీ ఉండవని, కాపుల రిజర్వేషన్ను తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలని డిమాండ్ చేశారు.