paripoornanada: ఈ తెలంగాణకు గొప్ప భవిష్యత్తు రావాలంటే పేర్లలోని ఆ 'బాదు' తీసేయండి!: పరిపూర్ణానంద స్వామి
- నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎందుకు?
- ఆ బాదులను తీసేయండి
- అంతకు ముందు ఆయా ప్రాంతాలకు ఏయే పేర్లు ఉన్నాయో అవి పెట్టండి
- హిందువులు చేతితో పనిచేయాల్సి వచ్చినప్పుడు బాహుబలిగా మారాలి
తెలంగాణకు గొప్ప భవిష్యత్తు రావాలంటే కొన్ని పనులు చేయాలని రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఈ రోజు కామారెడ్డిలో భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లతో కలిసి పరిపూర్ణానంద ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. యువకులు ర్యాలీగా ఆ వైపునకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ... తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు బాదు, బాదు అని పెట్టుకున్నారని అన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ అని అంటున్నారని, ఆ బాదులు పోవాలని తెలిపారు. అప్పుడే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇవన్నీ తీసి పాడేయాలని, ఈ బాదులు రావడానికి ముందు ఆ ప్రాంతాలకు ఏ పేరులు ఉన్నాయో అవి పెట్టాలని అన్నారు. బాంబే, మద్రాసు, కలకత్తా పేర్లు మార్చారని, మరి నిజామాబాదు పేరును ఎందుకు మార్చలేరని ప్రశ్నించారు. హిందువులు చేతితో పనిచేయాల్సి వచ్చినప్పుడు బాహుబలిగా మారాలని, పనికి బుద్ధి కూడా ఉపయోగించాలనుకుంటే భజరంగ్ భళిగా మారాలని పిలుపునిచ్చారు.
బాహుబలి గురించి ప్రపంచమంతా చెప్పుకుందని, ఇక భజరంగ్ భళి గురించి చెప్పుకోవాల్సి ఉందని తెలిపారు. తెలంగాణ చరిత్రను నిలబెట్టాలంటే తెలంగాణ మీద దాడి చేసిన వారిని పూజించడం కాదని అన్నారు. కాగా, తాము గో మాంసం వద్దని చెబుతోంటే మత ఛాందస వాదం అంటున్నారని పరిపూర్ణానంద అన్నారు.
ప్రభుత్వాలను అడిగితే ఇది మతాల విషయం అని చెబుతున్నాయని, అలాగే అయోధ్య రామ మందిరంపై అడిగితే అది కూడా మత విషయం అని తప్పించుకుంటున్నాయని విమర్శించారు. హిందూ దేవాలయాలను ఎవ్వరినీ అడగకుండానే అభివృద్ధి, రోడ్ల పేరిట కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.