Chandrababu: అందుకే, చంద్రబాబు హడావుడిగా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చారు: అంబటి రాంబాబు
- పోలవరం ప్రాజెక్ట్‌పై వివాదం రాజుకుంది
- ప్రజల దృష్టిని మరల్చాలని అనుకున్నారు
- శాస్త్రీయత లేని నివేదికల ఆధారంగా తీర్మానాలు చేశారు
- భవిష్యత్తులో సమస్యలు వస్తాయి
కాపులకు రిజర్వేషన్ల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శల వర్షం కురిపించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై వివాదం రాజుకున్న వేళ.. ఆ విషయంపై ప్రజల దృష్టిని మరల్చడానికి కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చారని తెలిపారు. శాస్త్రీయత లేని నివేదికల ఆధారంగా కాపులకు రిజర్వేషన్ల తీర్మానాలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని అన్నారు.
కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇన్నాళ్లు కాలయాపన చేశారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం పోరాటం చేయడంతో ఇక తప్పని సరి పరిస్థితుల్లో మంజునాథ కమిషన్ వేశారని, అసలు ఆ కమిషన్ నివేదిక రాకుండానే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారని ఆరోపించారు.