YSRCP: తిరుమలలో జేఈఓపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా.. తీవ్ర ఆరోపణలు!
- తనతో వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎల్-1 పాసులు కావాలని డిమాండ్
- నిబంధనల ప్రకారం ఆరు మాత్రమే ఇస్తామన్న టీటీడీ
- ప్రభుత్వానికి సూట్ కేసులు మోస్తున్న జేఈఓ
- రోజా సంచలన విమర్శలు
గాలేరు, నగరి ప్రాజెక్టు సాధన కోసం పాదయాత్ర చేపట్టి, దాన్ని ముగించిన వేళ, తిరుమలేశుని దర్శనానికి వచ్చిన రోజా, టీటీడీ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగి, జేఈఓ శ్రీనివాసరాజుపై సంచలన విమర్శలు చేశారు. తనతో పాటు నడిచి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎల్-1 పాసులు ఇవ్వాలని రోజా డిమాండ్ చేయగా, నిబంధనల ప్రకారం, ఎమ్మెల్యేతో పాటు వచ్చిన ఆరుగురికి మాత్రమే పాసులను ఇవ్వగలమని అధికారులు స్పష్టం చేయగా, రోజా తీవ్రంగా మండిపడ్డారు.
ప్రభుత్వానికి జేఈఓ సూట్ కేసులను అందిస్తున్నారని, ఏడేళ్లుగా పదవిని పట్టుకుని వేలాడుతున్నారని రోజా ఆరోపించారు. సర్వాధికారాలనూ చేతిలో ఉంచుకున్న ఆయన, తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చివేశారని ఆరోపించారు. ఈ అన్యాయాలపై తాను ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. చివరికి తన వెంట వచ్చిన 40 మందితో కలిసి కాలినడక దారిలో వస్తూ తెచ్చుకున్న దివ్యదర్శనం టోకెన్ల ద్వారానే ఆమె దర్శనానికి వెళ్లారు.