Delhi: ఇళ్ల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మేస్తూ.. 30 మంది జేఎన్యూ ప్రొఫెసర్లను మోసం చేసిన అమ్మకందారు!
- 30 మంది జేఎన్యూ ప్రొఫెసర్లను మోసగించిన వ్యక్తి
- వచ్చిన సొమ్ముతో విదేశీ ప్రయాణాలు
- ఎట్టకేలకు అరదండాలు
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన 30 మంది ప్రొఫెసర్లను తెలివిగా మోసగించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గురుగ్రామ్‌కు చెందిన హితేశ్‌గా పోలీసులు గుర్తించారు. వారి కథనం ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని ఖేడా డాబర్ గ్రామంలో తనకు వ్యవసాయ పొలం ఉందని అధ్యాపకులకు చెప్పిన హితేశ్ దానిని ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మేసుకుంటూ పోయాడు. ఇలా మొత్తం 30 మందిని మోసగించాడు.
ద్వారకలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఈ వ్యవహారం మొత్తం అక్కడి నుంచే నడిపినట్టు ద్వారక డీసీపీ శిబేష్ సింగ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హితేశ్‌ను అరెస్ట్ చేశారు.
మంచి ధర వచ్చిన ప్రతిసారి హితేశ్ మళ్లీ మళ్లీ ఆ భూమిని విక్రయించేవాడని, అలా ఆరుసార్లు అదే భూమిని వారికి అమ్మాడని పోలీసుల విచారణలో తేలింది. 2012లో తొలిసారి ఆ భూమిని దాదాపు రూ.6 కోట్లకు విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. వచ్చిన డబ్బులతో హితేశ్ ఎంజాయ్ చేసేవాడని, విదేశాలకు టూర్లు వెళ్లేవాడని వివరించారు.