Gandhi Hospital: 'ల్యాబ్ లో మార్కులు కావాలంటే సర్దుకు పోవాల్సిందే!'అంటూ గాంధీ ఆసుపత్రిలో మెడికోలను వేధిస్తున్న నలుగురు అరెస్ట్!
- చాలా సంవత్సరాలుగా అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న ఉద్యోగులు
- అంతర్గత విచారణ తరువాత అరెస్ట్
- బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేయాలంటున్న పోలీసులు
ల్యాబ్ పరీక్షల్లో మార్కులు రావాలంటే, తమ కోరికలను తీర్చాల్సిందేనని గాంధీ ఆసుపత్రిలో వైద్య విద్యను అభ్యసిస్తున్న అమ్మాయిలను వేధిస్తున్న నలుగురు ఉద్యోగులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా వీరు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారని, వీరి బారిన ఎందరో అమ్మాయిలు పడ్డారని, వారంతా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారు.
తమకు సహకరించకుంటే, తక్కువ మార్కులు వేస్తామని బెదిరిస్తున్న వీరిని రిమాండ్ కు తరలిస్తున్నామని నార్త్ జోన్ డీసీపీ సుమతి వెల్లడించారు. ట్రైనీ డాక్టర్లకు ల్యాబ్ పరీక్షల్లో మార్కులు వేయడం తమ చేతుల్లో ఉందన్న కారణంతో, ల్యాబ్ అసిస్టెంట్ లు మహ్మద్ అక్రమ్, ఆంథోన్ సెబాస్టియన్, మధుబాబు, మండలం దుర్గాదాస్ లు ఈ దారుణాలు చేశారని, మహిళా ట్రైనీ డాక్టర్ల నుంచి గాంధీ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు వెళ్లగా, ఆయన ఓ కమిటీ వేసి నిజాలను వెలుగులోకి తీసుకు వచ్చారని, వీరందరినీ అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఫిర్యాదు చేసేందుకు అమ్మాయలు భయపడవద్దని, ఎవరి పేరూ బయటకు రాకుండా చూస్తామని సుమతి అభయమిచ్చారు.