Chandrababu: చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడు?..ఇప్పుడెందుకు వద్దంటున్నాడు? : బాబును నిలదీసిన ఉండవల్లి
- పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ఎందుకు తీసుకున్నారు?
- ఈ రోజు ఎందుకు తిరిగి అప్పగించేస్తామంటున్నారు?
- చంద్రబాబుకు సలహాలు ఇస్తున్న ఆ మేధావి ఎవరు?
పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని చంద్రబాబునాయుడు ఆరోజు ఎందుకు తీసుకున్నారు? ఈవేళ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని కేంద్రం భావిస్తే... కేంద్రానికే ఇచ్చేస్తామని ఈరోజు ఎందుకు చెబుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిలదీశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, 2014లో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి నీతి ఆయోగ్ నివేదిక ఇస్తూ... పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతోందని, సొంత రాష్ట్రం తమ పనులను చేస్తామంటే ఆ రాష్ట్రానికే ఇవ్వచ్చు అని రికమెండేషన్ చేసిందని అన్నారు.
అంతే కాకుండా ఆరోజే 2014 లో ఉన్న రేట్ల ప్రకారమే నిధులు ఇస్తామని స్పష్టంగా చెప్పిందని ఆయన తెలిపారు. అలాంటప్పుడు మేధావి అయిన చంద్రబాబు ఎలా అంగీకరించారని ఆయన అడిగారు. కేంద్రమే పోలవరం పూర్తి చేస్తామంటే.. వద్దు మేము చేస్తామని ఆ రోజు ఎందుకన్నారు? ఈ రోజు కేంద్రం అడిగితే ఇచ్చేస్తామని అంటున్నారు..అసలు ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
తాజాగా ఒక బీజేపీ నేత.. 'పోలవరం గురించి ఎక్కువ మాట్లాడితే అందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్'త అని హెచ్చరించారని...దాని వెనుక వాస్తవాలు ఏంటని ఆయన అడిగారు. ఇకపోతే పోలవరం పనుల కోసం టెండర్లు పిలిచినప్పుడు...దానిపై పేపర్ ప్రకటన ఇచ్చినప్పుడు, అదే ప్రకటనను ఆన్ లైన్ లో వెబ్ సైట్ లో ఎందుకు అప్ లోడ్ చెయ్యలేదని ఆయన అడిగారు. టెండర్ పేరే 'ఈ ప్రొక్యూర్ మెంట్' అన్నప్పుడు దానిని వెబ్ సైట్ లో ఎందుకు అప్ లోడ్ చేయలేదని ఆయన నిలదీశారు.
పేపర్లో ఇచ్చిన టెండర్ ప్రకటనతో ఆ తరువాత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ప్రకటనను పోల్చి చూస్తే దీని వెనుక వాస్తవాలు అర్థమవుతాయని ఆయన చెప్పారు. పేపర్ ప్రకటనలో 1300 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులు అని పేర్కొనగా... వెబ్ సైట్ లో 1400 కోట్ల రూపాయలకు పైగా పనులు అని పేర్కొన్నారని, అలాగే పేపర్ లో 4వ తేదీ లాస్ట్ డేట్ అని ఉంటే.. వెబ్ సైట్ లో 20 లాస్ట్ డేట్ అన్నారని ఆయన తెలిపారు. దీంతో కాంట్రాక్టర్ ఫిక్స్ అయిపోయాడని అర్ధం కావడం లేదా? అని ఆయన నిలదీశారు. ఇలాంటి సలహాలు చంద్రబాబుకు ఏ మేధావి ఇస్తున్నాడో తెలియదు కానీ... 2018నాటికి పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది? అని అడిగి చేయించుకోవాల్సిన చంద్రబాబు...ఏం చేస్తున్నావు? అని అడిగించుకునే పరిస్థితుల్లోకి వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.