BJP: గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ బాహాబాహీ... కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి గాయాలు!
- గుజరాత్ ఎన్నికలలో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా నిలిచిన ఇంద్రనీల్ రాజ్ గురు
- గుజరాత్ సీఎం విజయ్ రూపానీపై పోటీకి దిగిన ఇంద్రనీల్ రాజ్
- బీజేపీ కార్యకర్తల దాడిలో ఇంద్రనీల్ సోదరుడు దీపుకు తీవ్రగాయాలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగిన ఘటన రాజ్ కోట్ వెస్ట్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పోటీచేస్తున్న రాజ్ కోట్ లో ప్రచారం కోసం ప్రధాని మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తొలగించడం మొదలు పెట్టారు.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, ఈ ఎన్నికల్లోనే 123.78 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతుడిగా పేరొందిన ఇంద్రనీల్ రాజ్ గురుకు కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో తన సోదరుడు దీపు రాజ్ గురు తో కలిసి అక్కడికి చేరుకుని వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది తీవ్ర రూపం దాల్చడంతో బాహాబాహీకి దిగరు.
దీంతో పోలీసులు ఇంద్రనీల్ రాజ్ గురును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బీజేపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన దీపు రాజ్ గురును హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఇంద్రనీల్ రాజ్ గురును అదుపులోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అరెస్టుకు నిరసనగా వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు.