telangana: రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకు ఖాళీలు ఉన్నాయి...ఎందుకు భర్తీ చేయడం లేదు?: కోదండరాం

  • 2014లో లక్షా ఏడు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పారు
  • మూడేళ్ల తరువాత లక్షా 12 వేల ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు
  • 46 వేల మంది రిటైర్ అయ్యారు...కొత్త జిల్లాలు వచ్చాయి ఖాళీలు మాత్రం పెరగలేదు, ఎందుకని?

'కొలువుల కొట్లాట' సభకు అనుమతి తెచ్చుకోవడం పెద్ద విజయమేనని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో నలుగురు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక మీటింగ్ కు అవకాశం దొరకడం అన్నది విజయమేనని ఆయన పేర్కొన్నారు. రాజకీయమంటేనే కొలువు అని, అలాంటప్పుడు కోదండరాం రాజకీయ నిరుద్యోగి అని టీఆర్ఎస్ నేతలు పేర్కొనడం అవివేకమని ఆయన చెప్పారు.

తామెప్పుడూ సమస్య పరిష్కారం కోసమే ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమని తామెప్పుడూ డిమాండ్ చేయలేదని ఆయన అన్నారు. తాము అడుగుతున్నది అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? వాటిని ఎప్పుడు? ఎలా? భర్తీ చేస్తారో చెప్పాలని అడుగుతున్నామని ఆయన అడిగారు. పోలీసు శాఖలో ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు, టీఎస్పీఎస్సీ ద్వారా ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేశారని ఆయన తెలిపారు.

అంటే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 16,000 మాత్రమేనని ఆయన చెప్పారు. 2014లో లక్షా ఏడు వేల ఖాళీలు ఉన్నాయని సీఎం చెప్పారని ఆయన గుర్తు చేశారు. మూడున్నర సంవత్సరాలు దాటిన తరువాత లక్షా 12 వేల ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారని ఆయన తెలిపారు. 46,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. కొత్తజిల్లాలు వచ్చాయి, అయినా ఖాళీల సంఖ్య పెరగలేదని చెప్పడం సరైనదేనా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News