Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడు రాహుల్ నామినేషన్.. ఏకగ్రీవం?
- నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
- అధ్యక్ష పదవి దాదాపు ఏకగ్రీవం.. నేడు ప్రకటించే అవకాశం
- ఢిల్లీ చేరుకున్న తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు
ఘన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి యువనేత అధ్యక్షుడు కావడానికి సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాహుల్ తల్లి, ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఇతర సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
నామినేషన్లకు నేడు ఆఖరు తేదీ కాగా, ఇప్పటి వరకు మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రాహుల్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. రాహుల్ ఒక్కరే నామినేషన్ వేసినట్టయితే ఆయనను నేడే అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. నిజానికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న పోలింగ్ జరగాల్సి ఉండగా 19న కౌంటింగ్ జరగాల్సి ఉంది.
రాహుల్ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్‌తోపాటు పలువురు సీనియర్ నేతలు రాహుల్‌ను బలపరుస్తారని పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ ముళ్లపల్లి రామచంద్రన్ తెలిపారు. మొత్తం 90 నామినేషన్ పత్రాలను ఆయా రాష్ట్రాల పార్టీ కార్యాలయాలకు పంపించామని, ఇప్పటి వరకు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాష్ట్రాల ప్రతినిధులందరూ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని రాహుల్‌ను బలపరుస్తూ 75 నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని ఆయన వివరించారు.
రాహుల్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డి, జైపాల్ రెడ్డి, వీహెచ్, పొన్నాల, భట్టి విక్రమార్క, రాజ్యసభ, లోక్ సభ సభ్యులు కలిసి 18 మంది ఢిల్లీకి చేరుకున్నారు.