Undavalli arun kumar: కమిషన్లు తీసుకోవడం.. అదంతా ఓ బ్రహ్మపదార్థం... వేలు పెట్టని వాడే ఉండడు!: ఉండవల్లి అరుణ్ కుమార్
- ప్రాజెక్టుల్లో కమిషన్లు సర్వసాధారణమే
- అందనివారు విమర్శలు చేస్తుంటారు
- పోలవరం ఆలస్యం వెనుక టీడీపీ, బీజేపీ
- కేసులకు భయపడుతున్న చంద్రబాబు
ప్రాజెక్టులు అనౌన్స్ చేసినప్పటి నుంచి, వాటి కాంట్రాక్టులు, బిడ్డింగ్ ప్రక్రియ, ఆపై కమిషన్లు తీసుకోవడం... ఇదంతా ఓ బ్రహ్మపదార్థం వంటిదని, దానిలో వేలుపెట్టని వాళ్లే ఉండరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంలోని వారికే ఈ అంతు తెలియని బ్రహ్మపదార్థంపై పూర్తి అవగాహన ఉంటుందని, తెలియని వాళ్లు విమర్శిస్తుంటారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తావనకు వచ్చిన వేళ, ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రాజెక్టుపై సంకీర్ణంలో భాగంగా ఏర్పడ్డ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ప్రాజెక్టు ఆలస్యం వెనుక టీడీపీ, బీజేపీల తప్పుందని ఆరోపించారు. పోలవరం విషయంలో చంద్రబాబునాయుడు ఎన్నో సెల్ఫ్ గోల్స్ వేసుకున్నాడని, అతనికి తెలియకుండానే ఇలా చేసుంటాడని మాత్రం అనుకోవడం లేదని అన్నారు. ఓటుకు నోటు వంటి కేసులతో భయపడే చంద్రబాబు రాజీకి వచ్చుండవచ్చని అభిప్రాయపడ్డారు. ఆ విషయం మరుగున పడ్డ తరువాత, ఇప్పుడు చేసిన అప్పులకు లెక్కలు చెప్పలేక భయపడుతున్నారని ఆరోపించారు. అప్పుగా తెచ్చిన రూ. 1.20 లక్షల కోట్లకు, ఫైనాన్స్ కమిషన్ కు లెక్కలు చెప్పలేక ఆయన అవస్థలు పడుతున్నారని ఎద్దేవా చేశారు.