Undavalli Arun Kumar: చంద్రబాబును మరోసారి బీజేపీ నొక్కేసింది: ఉండవల్లి అరుణ్ కుమార్
- అందుకే బీజేపీ తిడుతున్నా మెతక వైఖరి
- తన నేతలను రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఆపుతున్న చంద్రబాబు
- రాష్ట్ర ప్రయోజనాలా? స్వప్రయోజనాలా?
- విషయం తనకు అర్థం కావడం లేదన్న ఉండవల్లి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి నొక్కేసిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. అందుకే ఆయన ఇవాళ, బీజేపీ నేతలను ఏమీ అనవద్దని తన పార్టీ నేతలకు సూచించినట్టు పేపర్లలో వచ్చిందని అన్నారు. పోలవరం విషయంలో బీజేపీ నేతలు పదేపదే టీడీపీపై విమర్శలు చేస్తున్నా, ఆయన పట్టించుకోవడం లేదని, కనీసం కౌంటర్ కూడా ఇవ్వవద్దని, రాష్ట్ర ప్రయోజనాల పేరు చెబుతూ, తన నేతలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీని వెనకున్నది రాష్ట్ర ప్రయోజనాలా? లేక స్వప్రయోజనాలా? అన్న విషయం తనకు అర్థం కావడం లేదని చెప్పారు. తగ్గి ఉందామని ఆయన అంటున్న వెనక అసలు ఉద్దేశం తెలియడం లేదని అన్నారు.
"పదింటిలో నెగ్గి... మూడింటిలో తగ్గుతున్నాను అని ఆయన చెబితే... ఓహో అని అభినందించవచ్చు. ఎక్కడ నెగ్గాడో ఒక్కటి చెప్పమనండి. జాయింట్ కాపిటల్... ఈ టెన్ ఇయర్స్ ఇక్కడే ఉండాలిగా. ఆల్ మోస్ట్ హోదా కల్పించినట్టుగానే పెట్టారు. గవర్నర్ కు పవర్స్ ఇస్తూ, గవర్నర్ పవర్స్ ని తెలంగాణ క్యాబినెట్ క్వశ్చన్ చేయడానికి వీల్లేదని రాశారు. అంతకన్నా ఏముంటుంది? తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ పై ఏ నిర్ణయం తీసుకున్నా, గవర్నర్ దాన్ని అధిగమించవచ్చు. ఎప్పుడూ ఇలా జరగలా. భారతదేశంలో ఫస్ట్ టైమ్ జరిగిందిలా. దానిమీదే పెద్ద డిస్కషన్ జరిగింది. ఆర్టికల్ 3 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం" అని విభజన నాటి ఘటనలు గుర్తు చేసుకున్నారు ఉండవల్లి.
కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ ఉండగా, కేంద్రంలో భాగస్వామ్యం కలిగున్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ఎవడన్నా శంకుస్థాపన రోజునే కాపురం మార్చేస్తారా? అని అడిగారు. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై చంద్రబాబుకు పట్టులేదన్న విషయం అక్కడే స్పష్టమైందని, ఎప్పటికప్పుడు ఆయన్ను అణచిపెట్టే ఆయుధాలు కేంద్రం వద్ద ఉన్నాయని అన్నారు.