telangana: తెలంగాణను 'మేమే తెచ్చాం' అంటున్నారు.. అందరం కలసి కొట్లాడితేనే వచ్చింది!: ప్రొ.కోదండరామ్
- అందరం కలిసి సాధించుకున్నాం
- తెలంగాణ సాధించిన వారికి కొలువులు తెచ్చుకోవడం అసాధ్యం కాదు
- అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ ఏం చేస్తోంది?
- భూముల దందా, కాంట్రాక్టుల మీద చూపిస శ్రద్ధ కొలువులు ఇవ్వడంలో లేదు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో కొనసాగుతోన్న 'కొలువులకై కొట్లాట' సభలో టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ముగింపు ప్రసంగం చేశారు. ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. 'తెలంగాణను మేమే తెచ్చాం.. మేమే తెచ్చాం' అని కొందరు చెప్పుకుంటున్నారు. అయితే అందరం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, అందరి కోసం పనిచేయకపోతే కచ్చితంగా మేము అడుగుతాం. రాజకీయాల్లో మీరు ఉన్నారు.. ప్రజాసమస్యలపై కొట్లాడుతోంటే మేము రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారు. కలుషితమైన రాజకీయాలను మార్చుకుంటాం, ఈ సమాజం మాది, భవిష్యత్తు మాది. ఇది మన తెలంగాణ.. మన కోసం తెచ్చుకున్న తెలంగాణ. చావు పరిష్కారం కాదు. విద్యార్థులు పోరాడాలి గానీ ఆత్మహత్యలు వద్దు. తెలంగాణ తెచ్చుకున్న వారికి కొలువుల సాధన అసాధ్యమేమీ కాదు' అని ఉద్వేగపూరితంగా కోదండరామ్ అన్నారు.
హోంగార్డుల సమస్యలను కూడా తాము సర్కారుకి వివరించామని, ఎన్నో సమస్యలను వివరించామని కోదండరామ్ అన్నారు. ఎన్నో సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిపారు. "మా పోరాటం అడ్డుకుంటే ఆగేది కాదు. ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయని అంటున్నారు. ఐటీ రంగంలోనూ తెలంగాణ వారు లేరు.. ఎంత మంది ఉన్నారు? స్థానికులకే ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయాలి.
తెలంగాణ వచ్చిన తరువాత కూడా చాలా మంది దుబాయికి వెళుతున్నారు.
అప్పు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఖాళీ కడుపుతో చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని విద్యార్థులు అడుగుతున్నారు. యువత భవిష్యత్తు మీద ఆశను కోల్పోయి ఉంది, ఇది ప్రభుత్వ వైఫల్యమే. విద్యార్థులకు, యువతకు ఓ ఆశ, విశ్వాసాన్ని కల్పించడంలో సర్కారు విఫలమైంది. ఖాళీ కడుపులతో ఉద్యోగాల కోసం ఆశ పెట్టుకుని చదువుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ పార్టీ భూముల దందా, కాంట్రాక్టుల మీద చూపిన శ్రద్ధ కొలువులు ఇవ్వడంలో చూపడం లేదు. మమ్మల్ని రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. ఇటువంటి మాటలు వింటుంటే నాకు నవ్వొస్తోంది.. ఓట్లేసి గెలిపించారు.. ముఖ్యమంత్రి మంత్రులకు కూడా దొరకడం లేదు.. ఇక మనకేం దొరుకుతాడు.. వినడు, చూడడు. అసలు సచివాలయానికి కూడా సరిగ్గా రాడు.. కాంట్రాక్టులు, కమిషన్లు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది" అంటూ కోదండరామ్ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు.