giddi eswari: జగన్ నిర్ణయమే ఫైనల్.. అసెంబ్లీ బహిష్కరణ కూడా అలాంటిదే!: గిడ్డి ఈశ్వరి
- పార్టీ మీటింగుల్లో అభిప్రాయం చెప్పమంటారు
- ఒకరిద్దరు చెబుతారు. దానిని పట్టించుకోరు
- ఆయనే నిర్ణయాలు తీసుకుంటారు
'వైఎస్సార్సీపీలో ఎవరైనా చెబితే జగన్ వింటారా? అసలు జగన్మోహన్ రెడ్డిగారికి నచ్చజెప్పగలిగే వారు ఉన్నారా?' అని 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో గిడ్డి ఈశ్వరిని ఆర్కే అడిగారు. 'కొన్ని పార్టీల్లో ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అంటూ పార్టీ మీటింగుల్లో అభిప్రాయాలు తీసుకుంటారు. చివరగా మంచి నిర్ణయం ఏదైతే దానిని అమలు చేస్తారు. వైఎస్సార్సీపీలో అలా ఉంటుందా?' అని ఆయన అడిగారు.
దానికి ఆమె సమాధానమిస్తూ, "అలాంటిదేమీ లేదు సర్.. ఆయనే నిర్ణయాలు తీసుకుంటారు. మామూలుగా పార్టీ మీటింగుల్లో అభిప్రాయాలు చెప్పమంటారు. చిట్టచివరికి ఏదైనా అభిప్రాయం చెప్పినా.. అంతవరకే ఉంటాయి. నిర్ణయాలు మాత్రం ఆయనే తీసుకుంటారు. అభిప్రాయాలు చెప్పమంటారు కానీ, మనం చెప్పిన అభిప్రాయాల్లో దేనినీ టేకప్ చేసినటువంటి పరిస్థితులు లేవు. వాళ్లు చెప్పమన్నారు కనుక అభిప్రాయాలు చెబుతాం.
అంతెందుకు, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? బహిష్కరించాలా? అన్నదానిపై అభిప్రాయాలు అడిగితే... అందరికీ అసెంబ్లీకి హాజరు కావాలనే ఉంది. ఒకరిద్దరం ఇదే చెప్పాం...ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో గతంలో అసెంబ్లీ సమావేశంలో మైక్ లు ఇవ్వలేదు. దీంతో ఈసారి పార్టీ అధినేత కూడా ఉండడు. అలాంటప్పుడు హాజరైనా ఉపయోగం ఉండదు అని భావించాను. అయితే మొదటి రోజు సమావేశాలకు హాజరై ధర్నాలాంటిది చేద్దామని భావించాము. రోజా కూడా అలాగే భావించింది. అయితే పార్టీ అధినేత అసెంబ్లీకి హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారు. దానినే శిరసావహించాం" అని ఆమె తెలిపారు.