Virat Kohli: అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగాలంటే ఇలా ఉండకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా!: కోహ్లీ
- సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడడం పుజారా నుంచి నేర్చుకున్నా
- ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమవడంతో మానసికంగా కుంగిపోయా
- అప్పటి నుంచి ఆహారం నుంచి అన్నీ మార్చేశా
ఓపెనర్ చటేశ్వర్ పుజారాపై టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ప్రసంశల వర్షం కురిపించాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడడం అతడిని చూసే నేర్చుకున్నానని తెలిపాడు. తనకు టెస్ట్ క్రికెట్ ఫార్మాటే అత్యంత ఇష్టమని, పుజారాను చూసే తామంతా క్రీజులో సుదీర్ఘంగా గడపడం నేర్చుకున్నామని కోహ్లీ వివరించాడు. పుజారా ఏకాగ్రత తనకు చాలా గొప్పగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. జట్టు కోసం క్రీజులో ఎక్కువసేపు ఉండాలన్న తపన, అంకితభావం అతడిలో తనకు కనిపిస్తాయన్నాడు. తనకు స్ఫూర్తి అదేనని పేర్కొన్నాడు. జట్టు కోసం ఆడుతున్నామనుకున్నప్పుడు అలసట మాయమైపోతుందని అన్నాడు.
కెరీర్‌లో ‘రెండో ఇన్నింగ్స్’ చాలా కీలకమైనది, కష్టమైనది అని కోహ్లీ పేర్కొన్నాడు. అందుకనే నెట్స్‌లో వీలైనంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. 2012 ఐపీఎల్ తనలో మార్పు తీసుకొచ్చిందని కోహ్లీ వివరించాడు. ‘‘ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 180 పరుగులు చేశా. ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించా. దీంతో ఐపీఎల్‌పై బోల్డన్ని అంచనాలు పెట్టుకున్నా. అయితే అవన్నీ తలకిందులయ్యాయి. ఘోరంగా విఫలమయ్యా. దీంతో మానసికంగా చాలా దెబ్బతిన్నా. దాని నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నించా. ఆహారం, ఇతర అలవాట్లను మార్చేశా. ఓ అద్దంలో నన్ను నేను చూసుకున్నాక, అంతర్జాతీయ క్రికెటర్ కావాలనుకుంటే ఇలా ఉండకూడదని తెలిసింది. అప్పటి నుంచి ఆహారం నుంచి అలవాట్ల వరకు అన్నీ మార్చేశా. గంటల కొద్దీ జిమ్‌లో గడపడం నేర్చుకున్నా’’ అని కోహ్లీ వివరించాడు.