North Korea: ఉత్తరకొరియాను ఎదుర్కునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన జపాన్!
- హ్వాసంగ్ 15 క్షిపణిని జపాన్ జలాల్లో పడేసిన ఉ.కొరియా
- 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకునే క్షిపణి కోసం జపాన్ ప్రయత్నాలు
- ఉ.కొరియా మిసైల్ సైట్ను చేరేలా భారీ సామర్థ్యం ఉన్న క్షిపణి కొనుగోలు?
ఇటీవలే అత్యంత శక్తిమంతమైన హ్వాసంగ్ 15 క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా దాన్ని జపాన్ జలాల్లో పడేసింది. ఎన్ని హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు పాల్పడుతుండడంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక మాటలతో కాకుండా చేతలతోనే ఉత్తరకొరియాపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నాయి. ఇప్పటికే అమెరికా-దక్షిణ కొరియా కలిసి కొరియన్ ద్వీపకల్పంలో యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు ఉత్తరకొరియా మిసైల్ సైట్ను చేరేలా భారీ సామర్థ్యం ఉన్న క్షిపణిని కొనుగోలు చేసేందుకు జపాన్ ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది జపాన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో క్షిపణి కొనుగోలు కోసం నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఏకంగా 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకునే క్షిపణి కోసం జపాన్ ప్రయత్నాలు జరుపుతోంది. ఉత్తరకొరియాను ఎదుర్కునే క్రమంలో తాము అమెరికాతో కలిసి పని చేస్తామని జపాన్ రక్షణ మంత్రి చెప్పారు.