aadhaar: ఆధార్ కార్డు రూపంలో వెడ్డింగ్ కార్డ్... వినూత్న ప్రయత్నం చేసిన మధ్యప్రదేశ్ వాసి!
- కూతురు పెళ్లి పత్రికకు కొత్త హంగులు
- ఆధార్ ప్రాముఖ్యతను తెలిపే ప్రయత్నం
- మెచ్చుకుంటున్న స్థానికులు
కూతురు పెళ్లి చేస్తే పది తరాలు గుర్తుండిపోవాలని విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతారు. కానీ మధ్యప్రదేశ్‌లో కత్ని జిల్లా విలయత్కలాన్ గ్రామానికి చెందిన వీరేంద్ర తివారీ తెలివిగా చేసిన చిన్న ప్రయత్నం, ఆయన కుమార్తె పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిందని స్థానికులు అంటున్నారు. తన కుమార్తె పెళ్లి పత్రికను ఆధార్ కార్డు డిజైన్‌లో ముద్రించి వీరేంద్ర ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.
నిజానికి అందరిలో ఆధార్ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచేందుకే ఆయన ఈ వినూత్న ప్రయత్నం చేశాడు. 'మొదట పెళ్లికార్డుల్లో ప్రత్యేకత చూపించడానికి క్యాలెండర్ డిజైన్‌లో కొట్టిద్దాం అనుకున్నాం... కానీ తర్వాత సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డు డిజైన్ వేయించాం' అని వీరేంద్ర చెప్పారు. క్యూఆర్ కోడ్, బార్ కోడ్, ఆధార్ నెంబర్, యూఐడీఏఐ చిహ్నం, ఫొటో స్థానంలో అబ్బాయి, అమ్మాయి ఫొటో ఇలా అచ్చుగుద్దినట్లు ఆధార్ డిజైన్‌లో ఉన్న కార్డును చూసి స్థానికులు వీరేంద్రను మెచ్చుకుంటున్నారు.
తివారీకి 'షాదీ సువిధ కేంద్ర' అనే మ్యారేజ్ బ్యూరో ఉంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ సామాజిక అంశాలు ప్రతిబింబించేలా పెళ్లిపత్రికలు ముద్రించాలని చెబుతుంటారు. అంతేకాదు తండ్రి జ్ఞాపకంగా ఆయన చనిపోయినప్పుడు వంద మొక్కలు నాటడం, తన పుట్టినరోజైన అక్టోబర్ 30న కట్న రహిత దినంగా జరుపుకోవడం.. ఇలా చాలా సామాజిక కార్యక్రమాలు తివారీ చేస్తుంటారు.