Pawan Kalyan: ఇంగ్లండ్ పర్యటనలో ఓ విద్యార్థి వేసిన ప్రశ్న నన్ను అంతర్మథనంలో పడేసింది: పవన్ కల్యాణ్
- సమావేశంలో ఒక విద్యార్థి నన్ను ఓ విషయంపై ప్రశ్నించాడు
- కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదాన్ని ప్రస్తావించాడు
- టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నాడు
- టీడీపీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేశావన్నాడు.. నిజమే!
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో పవన్ ముచ్చటించారు. తనకు అక్కడ ఎదురైన అనుభవాన్ని పవన్ కల్యాణ్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. "నేను ఇటీవల జరిపిన ఇంగ్లండ్ పర్యటనలో నన్ను అంతర్మథనంలో పడేసిన సంఘటన ఒకటి జరిగింది. విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఒక విద్యార్థి నన్ను ఓ విషయంపై ప్రశ్నించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదాన్ని ప్రస్తావించాడు.
తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నాడు. టీడీపీకి మద్దతుగా ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసినందుకు మీరు కూడా బాధ్యులు కాదా? అని ప్రశ్నించాడు. ఆలోచిస్తే ఆ యువకుడు అడిగిన ప్రశ్నలో సహేతుకత ఉందనిపించింది. అందువల్ల కృష్ణానది పడవ ప్రమాదమే కాకుండా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ కారణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంకటేష్ ఆత్మహత్య ఉదంతంలోనూ నా వంతు బాధ్యత ఉందని అంగీకరిస్తున్నాను. వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించడానకి రేపే వెళుతున్నాను" అని పేర్కొన్నారు.