Pakistan: ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి నిధులు నిలిపేసి.. పాకిస్థాన్ కు షాకిచ్చిన చైనా!
- 50 కోట్ల బిలియన్ డాలర్లతో చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్
- ప్రాజెక్టులో భాగంగా మూడు కీలక రోడ్డు నిర్మాణ పనులు
- అవినీతి ఆరోపణల నేపథ్యంలో నిధులు ఆపేసిన చైనా
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) పేరిట 50 కోట్ల బిలియన్ డాలర్లతో చేపడుతున్న వివిధ పనుల్లో అవినీతి చోటుచేసుకుందంటూ పాకిస్థాన్ పత్రికల్లో వార్తలు వెలువడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ లో ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మూడు కీలకమైన రోడ్డు నిర్మాణ పనులకు చైనా తాత్కాలికంగా నిధుల విడుదలను నిలిపేసిందని డాన్ పత్రిక వెల్లడించింది. చైనా నిర్ణయంతో సీపెక్ పనులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా 210 కిలోమీటర్ల పొడవుతో 8,100 కోట్ల రూపాయల విలువైన డేరా ఇస్మాయిల్ ఖాన్-జొహోబ్ రోడ్డు ప్రాజెక్టు, 1,976 కోట్ల రూపాయలతో 110 కిలోమీటర్ల పొడవైన ఖుజ్దార్-బసిమా ప్రాజెక్టు, 850 కోట్ల రూపాయలతో 136 కిలోమీటర్ల పొడవైన కారకోరమ్ హైవే ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి. నిధులు నిలిపేస్తున్న విషయాన్ని చైనా అధికారులు ఇటీవల జరిగిన పాకిస్థాన్-చైనా అధికారుల జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో తెలిపారు.
చైనా నిర్ణయింతో తాము షాక్ కు గురయ్యామని పాక్ అధికారి తెలిపారు. బీజింగ్ నుంచి వచ్చే కొత్త మార్గదర్శకాల అనంతరం ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు విడుదలవుతాయని ఆయన చెప్పినట్టు డాన్ పత్రిక తెలిపింది. తొలుత ఈ పనులను పాకిస్థాన్ ఆరంభించింది. అయితే సీపెక్ పేరుతో నిధులు అందజేసి తామే దీనిని పూర్తి చేస్తామని చైనా చెప్పడంతో పాక్ అంగీకరించింది.