Sasikala: శశికళ కొత్త ఎత్తుగడ.. అమృతను నడిపిస్తున్న ‘చిన్నమ్మ’.. పార్టీని, ఆస్తులను చేజిక్కించుకునే పన్నాగం?
- రంజని ద్వారా వ్యవహారం నడిపిస్తున్న శశికళ
- జైలులో ‘చిన్నమ్మ’తో భేటీ అయిన రంజని
- ఆ తర్వాతే వెలుగులోకి అమృత
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనని చెప్పుకుంటున్న అమృత వెనక శశికళ ఉన్నారా? ఈ వ్యవహారం మొత్తాన్ని ఆమే వెనకుండి నడిపిస్తున్నారా? అమృతను ముందుపెట్టి పార్టీని, జయ ఆస్తులను చేజిక్కించుకోవాలని ప్లాన్ వేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. శశికళ ప్రోద్బలంతోనే అమృత సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇప్పుడు హైకోర్టుకు వెళ్తున్నారని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో అమృత పిటిషన్ వేసినప్పుడు ఆమెకు మద్దతుగా బంధువులైన లలిత, రంజనిలు సంతకాలు చేశారు.
లలిత గతంలో మీడియాతో మాట్లాడుతూ జయలలితకు ఆడపిల్ల పుట్టిన మాట వాస్తవమేనని, జయ ప్రసవ సమయంలో తమ దూరపు బంధువైన రంజని జయ పక్కనే ఉన్నారని తెలిపారు. మూడు నెలల క్రితం అమృతను ఆమే ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పుకొచ్చారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే అసలు విషయం వెల్లడవుతుందని చెప్పారు. అయితే తాజాగా బయటపడిన ఓ విషయం ఇప్పుడు తమిళనాడులో మరోమారు హాట్ టాపిక్ అయింది. పరప్పన అగ్రహార జైలులో శశికళతో రంజని భేటీ అయినట్టు ఓ తమిళ పత్రిక బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమృత ద్వారా జయలలిత వ్యక్తిగత రహస్యాలను బయటపెట్టాలని రంజనికి శశికళ సూచించినట్టు పత్రిక పేర్కొంది.
జయలలితకు తాను కూతురినని అమృత కనుక నిరూపించుకుంటే, ఆమెను అడ్డం పెట్టుకుని ఆ తర్వాత పార్టీని, ఆస్తులను తన సొంతం చేసుకోవచ్చనేది శశికళ వ్యూహంగా చెబుతున్నారు. జయ తల్లి సంధ్యకు సమీప బంధువైన రంజని పలుమార్లు పోయెస్ గార్డెన్‌కు వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, జయ ఆంతరంగిక విషయాలు శశికళకు బాగా తెలుసు కాబట్టి జయ కుమార్తె ఎవరనే విషయం ఆమెకు కచ్చితంగా తెలిసే ఉంటుందని, అమృత ముమ్మాటికీ జయలలిత కుమార్తే అయి ఉంటుందని అన్నాడీఏంకేలోని కొందరు నేతలు భావిస్తున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని రాధికా కాలనీలో ఉన్న ‘శశికళ నటరాజన్ నిలయం’లో జయలలిత కుమార్తెగా చెప్పుకుంటున్న ఓ యువతి సుదీర్ఘకాలం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఇల్లు శశికళ పేరుపైనే ఉంది. ఈ లెక్కన జయ కుమార్తె ఎవరో ఆమెకు బాగా తెలిసి ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కసారిగా అమృత తెరపైకి రావడం, శశికళతో రంజని భేటీ, తాజా పరిణామాలను చూస్తుంటే తెరవెనక ఏదో గూడు పుఠానీ జరగుతోందని అనుమానిస్తున్నారు.