2018 Winter Olympics: ఒలింపిక్స్ లో పాల్గొనకుండా రష్యాపై నిషేధం!
- 2018 వింటర్ ఒలింపిక్స్ కు దూరం
- ఉప ప్రధాని విటల్లీపై జీవితకాల నిషేధం
- ఆటగాళ్లకు కాస్తంత ఉపశమనం
రష్యా ప్రభుత్వమే స్వయంగా తమ ఆటగాళ్లకు ఉత్ప్రేరకాలు ఇస్తూ అంతర్జాతీయ పోటీలకు పంపుతోందని తేలిన నేపథ్యంలో వచ్చే సంవత్సరం జరిగే వింటర్ ఒలింపిక్స్ లో ఆ దేశంపై నిషేధం పడింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న రష్యా డిప్యూటీ ప్రధాని విటల్లీ ముత్కోపై జీవితకాల నిషేధాన్ని విధిస్తున్నామని, ఏ అంతర్జాతీయ క్రీడల పోటీల్లోనూ ఆయన భాగస్వామి కాలేరని తెలిపింది.
సోచి గేమ్స్ సమయంలో రష్యాకు క్రీడల మంత్రిగా ఉన్న విటల్లీ, పతకాల కోసం ఆటగాళ్లు డ్రగ్స్ వాడేందుకు ప్రోత్సహించారని వచ్చిన ఆరోపణలు నిర్ధారితమైన సంగతి తెలిసిందే. ఇక ఆయనపై నిషేధం పడటంతో, వచ్చే సంవత్సరం ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను నిర్వహించనున్న రష్యా ఆర్గనైజింగ్ కమిటీలో ఆయన స్థానం కూడా ప్రశ్నార్థకమైంది. కాగా, ఆటగాళ్లకు అన్యాయం జరుగకుండా, 'ఒలింపిక్ పతకం' కింద వారు పోటీల్లో పాల్గొన వచ్చని ఐఓసీ వెల్లడించింది. అయితే, వారిపై పూర్తి నిఘా ఉంటుందని, ప్రతి ఒక్కరికీ, వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీ) పరీక్షలు నిర్వహిస్తుందని పేర్కొంది.