North Korea: జపాన్ ద్వీపంలో ఉత్తరకొరియా జాలర్ల చేతివాటం!
- జపాన్ హొక్కాయిడో ద్వీపానికి వచ్చిన ఉత్తరకొరియా జాలర్లు
- ఆశ్రయం కోరిన కొరియా జాలర్లు
- తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వైనం
కష్టాల్లో ఉన్న ఉత్తరకొరియన్లకు ఆశ్రయం కల్పిస్తే.. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వైనం జపాన్ లోని ఒక దీవిలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... జపాన్ లోని హొక్కాయిడో ద్వీపానికి సమీపంలోని సముద్ర జలాల్లో ఉత్తరకొరియాకు చెందిన జాలర్లు తమ చెక్కపడవతో ఇబ్బంది పడడాన్ని తీరప్రాంత సిబ్బంది గుర్తించారు. తామంతా ఉత్తరకొరియాకు చెందిన జాలర్లమని, ప్రతికూల వాతావరణం కారణంగా ముందుకు వెళ్లలేకపోతున్నామని, ఆశ్రయం కల్పించాలని కోరారు. దీంతో ఆ ద్వీపంలో స్థానిక జాలర్ల కోసం ఏర్పాటు చేసిన భవంతిలోకి వారిని రానిచ్చాడు దాని రక్షణ చూసే వ్యక్తి.
ఆ భవన సంరక్షకుడు ఉదయం లేచి చూసేసరికి వారికి ఆశ్రయం ఇచ్చిన భవనం తలుపులు విరిగిపోయి కనిపించాయి. దీంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా జాలర్లు కనిపించలేదు. జాలర్ల తోపాటు ఇంట్లో ఉన్న రెండు టీవీలు, మూడు ఫ్రిజ్ లు, వాషింగ్ మెషిన్, ఓవెన్, స్టీరియో సెట్లు, డీవీడీ ప్లేయర్, హీటర్, మోటార్ బైక్, జనరేటర్, ఆఖరుకి ఇంటి తలుపులకు ఉన్న ఇనుప కొక్కేలు సహా అన్నీ ఎత్తుకెళ్లిపోయారు. దీంతో దొంగతనం జరిగిందని ఆ భవన సంరక్షకుడు జపాన్ తీరప్రాంత గస్తీ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. దీంతో జపాన్ జలాల్లోనే ఉన్న వారిని కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకున్నారు. దీంతో చోరీ చేశామని ఒప్పుకున్నట్టు జపాన్ మీడియా తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.