India: లంచ్ దాకా లాక్కొచ్చిన లంక... డ్రా చేసుకునేందుకు విఫలయత్నాలు!
- ఈ ఉదయం ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన లంక
- ఒక పరుగు మాత్రమే చేసి మ్యాథూస్ అవుట్
- హాఫ్ సెంచరీ చేసి రాణించిన ధనంజయ
న్యూఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్టు ఐదో రోజున మ్యాచ్ ని డ్రా చేసుకునేందుకు లంకేయులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్న నాలుగో రోజున 31 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి నేడు బ్యాటింగ్ ప్రారంభించిన లంకేయులు, లంచ్ విరామానికి ముందు ఒక్క వికెట్ ను మాత్రమే కోల్పోయి, స్కోర్ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో ధనంజయ హాఫ్ సెంచరీ చేసుకోగా, అతనికి చండీమల్ తనవంతు సహకారాన్ని అందిస్తున్నాడు.
ఉదయం ఆట ప్రారంభించిన కాసేపటికే మ్యాథ్యూస్ ను జడేజా తన అద్భుత బౌలింగ్ తో బోల్తా కొట్టించాడు. దీంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మ్యాథ్యూస్ 35 పరుగుల వద్ద అవుట్ కాగా, ఆపై మరో వికెట్ ను ఇండియా తీయలేకపోయింది. లంచ్ విరామ సమయానికి లంక స్కోరు 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు కాగా, విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే, మరో ఆరు వికెట్లు తీయాల్సివుంది. ఈ మ్యాచ్ లో లంక విజయం దాదాపు అసాధ్యమే, అయితే, కనీసం మరో నాలుగు గంటల పాటు వికెట్లు పోకుండా కాపాడుకోగలిగితే, మ్యాచ్ డ్రా అవుతుంది.