gauri lankesh: గౌరీ లంకేశ్ పత్రిక పేరు మార్పు... ఇక నుంచి 'నమ్మ గౌరీ' పేరిట విడుదల
- ప్రకటించిన గౌరీ మెమోరియల్ ట్రస్ట్ బృందం
- గౌరీ తల్లి కోరిక మేరకు మార్చినట్లు వెల్లడి
- ఆమె జ్ఞాపకార్థం అవార్డును కూడా ఏర్పాటు చేసిన ట్రస్ట్
మూడు నెలల క్రితం దుండగుల చేతిలో కాల్పులకు గురై మరణించిన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ జ్ఞాపకార్థం ఆమె నిర్వహించిన 'గౌరీ లంకేశ్ పత్రికే' పేరును 'నమ్మ గౌరీ'గా మార్చుతున్నట్లు గౌరీ మెమోరియల్ ట్రస్ట్ బృందం ప్రకటించింది. గౌరీ లంకేశ్ తల్లి ఇందిరా లంకేశ్ కోరిక మేరకు తాము టాబ్లాయిడ్ పేరును మార్చినట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.
ఆమె కోరినట్లుగానే పత్రిక పేరులో 'లంకేశ్' అనే పదం రాకుండా పేరును మార్చామని వారు తెలిపారు. కేవలం పత్రిక పేరు మాత్రమే మార్చామని, అక్కడి సిబ్బంది గానీ, అందించే వార్తల్లో గానీ ఎలాంటి మార్పు ఉండదని వారు చెప్పారు. అలాగే గౌరీ పేరుతో ఓ అవార్డును కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసింది. లంకేశ్ హత్యకు గురై మూడు నెలలు పూర్తవుతున్నప్పటికీ, నిందితులను ఇంకా పట్టుకోకపోవడంపై ట్రస్ట్ సభ్యులు, కుటుంబ సభ్యులు కర్ణాటక ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.