dhana manji: భార్య శవాన్ని భుజాన మోసుకుంటూ వెళ్లిన మాఝీ గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
- నాడు కాలినడకన భార్య శవంతో పది కిలోమీటర్ల నడక
- బెహ్రయిన్ రాజు ఆర్థిక సాయంతో కొత్త జీవితం
- మరో పెళ్లి.. కొత్త బైకు, హాస్టల్లో కుమార్తెల చదువు
ధనా మాఝీ.. ఈ పేరు చెప్పగానే భుజాన భార్య శవం వేసుకుని పది కిలోమీటర్ల పాటు నడిచిన వ్యక్తి కళ్లముందు కదలాడతాడు. గతేడాది ఆగస్టులో అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూసిన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ సమకూర్చకపోవడం, ప్రైవేటు అంబులెన్స్‌ను తెచ్చుకునే స్తోమత లేకపోవడంతో భార్య శవాన్ని భుజంపై వేసుకుని పది కిలోమీటర్ల నడక సాగించాడు. కుమార్తెతో కలిసి అతడు నడుస్తున్న ఫొటోలు, వీడియో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఎందరో హృదయాలను పిండేశాయి. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడిన ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన ఈ మాఝీ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
అతని దీనగాథకు చలించిన బహ్రెయిన్ ప్రధాని, రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మాఝీకి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.9 లక్షల చెక్కును పంపించారు. ఆయనతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చాయి. మీడియాలో అతడి పేరు మార్మోగిపోవడంతో ముందుకొచ్చిన అధికారులు ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజనా కింద కొత్త ఇంటిని మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ దశలో ఉంది.
బహ్రెయిన్ ప్రధాని ఇచ్చిన సొమ్ముతోపాటు పలువురు సాయంగా అందించిన నగదును బ్యాంకులో కుమార్తెల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అలమతి దై అనే మహిళను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఓ విద్యాసంస్థ ఆయన ముగ్గురు కుమార్తెలకు ఉచితంగా చదువు చెప్పిస్తోంది. ఇప్పుడు వారు భువనేశ్వర్‌లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నారు. పెళ్లయ్యాక ఓ హోండా బైక్‌ను కొనుక్కున్నాడు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగుచేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాడు.